ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ నాటి రాత్రి కథ.

నరనారాయణావతారధారులగు కృష్ణార్జును లిరువురును వెనుకటివలెనే——యెనిమిదవనాటి సాయం సమయమున సయితము, మృష్టాన్న భోజనం బొనరించి యమునా సైకతస్థలంబుల విహరింప నరియి——యందొక్క మనోహరస్థలంబున సుఖాసీనులై తాంబూల చర్వణంబొనరించు నవసరంబున, పార్థుఁడు పద్మనాభు నవలోకించి, “యో జగన్నాథా! గతరాత్రమున, నీవు దయతో నెఱిఁగించిన నీలకేతనుని చరితము పరమాశ్చర్యభరితము. ఎనిమిదవదియగు నిరాకార తత్త్వంబు నుపదేశించి కృతార్థు నొనరింపు" మని పలుకుటయు, నయ్యదునందనుఁడు మందస్మితవదనారవిందుఁడై “కిరీటీ! జీమూతవాహనమహారాజు చరిత్రముం జెప్పెడ, నాకర్ణింతువేని నీ సంశయము, వాయు" నని పలికి——తచ్చరిత్రము నిట్లు వచింప దొరకొనియెను.

జీమూతవాహనమహారాజు కథ.

విజయా! తొల్లి కాశ్మీర దేశంబును పరిపాలించుచుండిన మయూర వాహనమహారాజు మహాపతివ్రతయనందగు "అపర్ణాదేవిని" భార్యగా వడసియు నామెవలన చిర కాలము సంతతింగానక విసిగి——వృద్ధాప్యంబున “విపుల" యను నొకకన్యకం బరిణయమాడెను. విపుల నవయౌవనవతియగుటం జేసి—— వృద్ధనాధుని మనంబుననొల్లక మిగుల నేవగించుకొనుచుండెను. ఇదియిట్లుండ నప్పటి రాజసచివుఁడు వృద్ధుఁడై మృతినంద, నాతనికుమారుఁడగు చారుదత్తుఁడు మంత్రియయ్యెను. చారుదత్తుఁ డనన్య సౌందర్య ప్రభావిభాసితుండగుట, విపులా దేని యాతని యం దనుకర్త యయ్యెను. కొండొక దినమున మాండవ్యుఁడను నొక యోగిసత్తముఁడు రాజాస్థానంబునకువచ్చుటయు రాజసచివు లిరువురు నా యతీంద్రుని విధ్యుక్త విధానంబునఁ బూజించి సంతాన ప్రాప్తికిఁ గొం