ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయ సేనమహారాజు కథ

17


బొడుచుకొనఁబోవ జయసేనుం డాతని కరముం బట్టి నిలిపి, "తండ్రి ! నీకింత సాహసము చెల్లునే! నీవు మరణించినచో తండ్రి లేని నాకు దిక్కెవ్వ” రని కన్నీరు వెట్టుకొనియెను. తన మిత్రుఁడగు విజయసేనుని కుమారునిగా మణిమంతు నేఱింగి, ఋతుద్వజుండు మహానందముతోవచ్చి యాతనిం గౌగలించుకొని, జయసేన ప్రార్థితుండై ప్రతాపసేనుని క్షమించెను. తత్సమయంబున కటకుభగవానుండగు మతంగమహర్షి యరుదెంచి——సర్వజన సంపూజితుండై యుచితాసనంబు నలంకరించి "యోఋతుధ్వజా! ఈ జయసేనుఁడు పుణ్యాత్ముండు. నా శిష్యుఁడై నావలన సాంఖ్యసూత్రంబు నెఱింగిన పవిత్రుఁడు. ఇతఁడు నీ పుత్రికయగు మణిమంజరింగామించి యున్నవాఁడు. కావున నతని నీ యల్లునిగా నొనర్చుకొ"మ్మని పలుక నాతడు "మహాత్మా! నాకింతకన్నా ధన్యతగలదే! ” యని మహానందముతో నామోదించెను. తదనంతరము మతంగమహర్షియే వంగదేశ మత్స్య దేశంబులకు, సమాధానం బోనర్చి తద్దేశాధీశులను మిత్రులుగా నొనగించి, వంగ దేశాధిపతి పుత్రిక యగు; గుణమంజరిని, ప్రతాపసేన పుత్రుఁడగు వినయసేనున కిచ్చి యుద్వాహన బొనరింప నిర్ణయించెను. మణిమంజరీ జయసేనులకును, గుణమంజరీ వినయసేనులకును మునిసన్నిధానమున మహావైభవముతో కల్యాణములు గావింపఁబడియెను. కోడుకులు రాజ్యముం బాలించుచుండ ప్రతాపసేనుఁడు తన జీవిత శేషమును మతంగాశ్రమంబున వానప్రస్థుండై గడపెను.