పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/110

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విష్ణువర్ధన మహారాజు కథ

107


స్థుడవై రాజ్యపాలనంబొనర్చి రాజర్షి యనఁ బేరందు"మని పలుక నా రాజపుత్రుండు తొల్లి తన చిత్తము సావిత్రియందు హత్తిన తెరంగును, ఆబాలిక వ్రతంబునుం దెలుప, నమ్మునికొండొక యుపాయం బాతనికి బోధించి, తన కడనున్న యోగిని నొకతె నాతనికిఁదోడిచ్చి పంపెను.

సావిత్రి వీణావతికి రత్నహారమును, బహుమానముగానిచ్చిన కొన్ని దినంబుల కావల నొకనాడు రాజపత్ని కూతుం జూడవచ్చి, రత్నహారము లేకపోవుటంగాంచి, యందులకుఁ గారణంబడిగి తెలసికొని, మహావిహద భయాక్రాంతచిత్తయై విలపించుచు——"కుమారీ! స్వతంత్రించి ఎంతయవివేక కార్యంబొనరించితివి! ఆ హారము మనకు, కులక్రమాగతముగా వచ్చుచున్నయది. అది యెవ్వరిచేతఁబడునో వారు, ఆఱు నెలలలో నీ రాజ్యముం బాలింతురని యున్నదఁట! కటకటా! నేటి కొక భోగముతొత్తు మన రాజ్యమున కధికారిణి యగును కాఁబోలును! ఇంకేదిదారి?” యని వాపోవసాగెను. క్రమముగా రాజునకీవార్త తెలిసెను. అతం, డతిరయంబున, నావేశ్యం బట్టి తెచ్చుటకు, నలుదిశలకును దూతలనంపి—— పురనికటంబునఁగల శైలంబున నొక ఋషివచ్చి విడిచి యున్నాఁడనియు, నతం డాగతానాగతవేదియనియు విని, యాతని జోస్యమడుగ నటకరిగెను. యతి, యత్యంత తేజశ్ళాలియై కూర్చుండి, యుండెను. రాజాతనికి నమస్కరింప నాశీర్వదించి, యతఁడు వచ్చిన సంగతిం దెలిసికొని, “రాజేంద్రా! భీతిల్లకుము! అనతి కాలముననే, మాతపశ్శక్తి చే——నారత్నహారము, మీనందన కంఠమునకు వచ్చునట్లోనరింప గలవార"మని పలికెను. ధర్మపాలుండమితానందమునంది, యాముని కడ సెలవుంగొని గృహంబునకు వచ్చి యావార్తను భార్యాపుత్రికల కెఱిఁగించెను. యోగులన్నను, సన్యాసులన్నను సహజముగ ప్రీతిగల సావిత్రి యావార్తవిని, యేకాంతమునఁ దన చెలియగు మంజరిం జీరి "సఖీ! నన్ను పెండ్లియాడుమని నాతలిదండ్రులూరక వ్రేపుకొని తినుచున్నారు. నాహృదయ మందుల కనుమతింపకయున్నది. కాంతలకు సంసారమే