పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/64

ఈ పుటను అచ్చుదిద్దలేదు

జలజల మంజులార్భటుల జాల్కొను నీ సెలయేటికోవలన్‌
మొలచిన లేతపచ్చికల మోటుగఁ గాలిడఁబోకు, దేవదూ
తల రుచిరాధర ప్రకృతిఁ దాల్చెనొ! సుందర మందగామినీ
లలిత శరీరమృత్కణములం జిగిరించెనొ యేమొ కోమలీ!

పొలమున నేత్రపర్వముగఁ బూచిన రాగవతీ సుమంబు శో
భల విలసిల్లెఁ బూర్వనరపాలుర రక్తకణాలనుండి; యే
చెలియ నిగారపుం దళుకు చెక్కులనేలిన పుట్టుమచ్చపై
వెలసెనో నీలకాంత కనువిందొనరించును బూలరెమ్మలన్‌.

గతము గతంబె, యెన్నటికి కన్నులఁగట్టదు; సంశయాంధ సం
వృతము భవిష్యదర్థము; వివేకవతీ, యొక వర్తమానమే
సతత మవశ్యభోగ్యమగు సంపద; రమ్ము విషాదపాత్ర కీ
మతమునఁ దావులేదు; క్షణమాత్ర వహింపుము పానపాత్రికన్‌.
 
పాఱెడువాఁగు నీరమటు, పైఁబయి వీఁచు నెడారిగాలి నా
జాఱె మఱొక్కరోజు వరుసన్‌ మనయిద్దఱి జీవితంబులన్‌;
ఊరుపు మేననుండువఱ కుమ్మలికంగొన, రూపహీనమై
యారయరాని 'రేపు' నకు, నంతమునొందిన 'నిన్న' కున్‌ సఖీ.