ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాడు; కలకలా నవ్వాడు
      కన్నె చూడఁడు; ...చందమామో!

వాడి; కావి పంచెలమీఁద
      కస్తూరి తాపిస్తు; ...చందమామో!

వాడి; బంగారు చెక్కిళ్లు.
     రత్నాలు మెరిపిస్తు ...చందమామో!

వాడి; ముద్దైన మోముపై
      ముత్యాలు విరబోతు: ...చందమామో!

వాడి; నూనూగు మీసాలు
      వలపు తీగెలు పాకిస్తు, ...చందమామో!

వాడు; చూచినా చాలమ్మ
       స్వర్గ మేదరిదాపు: ...చందమామో!

వాడు; నవ్వుతూమాటాడి
      కవ్వించి పోయాడు; ...చందమామో!

వాని; నవ్వులోనే మనసు
      నను విడిచి పోయింది; ...చందమామో!

వాడు; పలికినా చాలమ్మ
      ప్రాణాలు వికసించు; ...చందమామో!

వాని; బంగారు మొలత్రాఁడు;
      పై, పైన మెరిసింది; ...చందమామో!

వాడి; ఉంగరాలజుట్టు
      రంగైన మగవాఁడు; ...చందమామో!

వాని; కోపాన ఒకసారి
      కసరి తిట్టినచాలు; ...చందమామో!