ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లిల్లేలు పాట

——ఇది సంక్రాంతి పండుగ కనుము రోజున మాదిగ కులంవారు గ్రామంలో సొమ్ము దండుకోటానికై, ఒక కావిడి, టట్టలు, వేసుకొని, ఒక లిల్లేలు పాటకుడు, కాళ్లకు గజ్జెలు, మొలకుధట్టి, వట్టి రీళ్లేలు కత్తి భుజం మీద వేసుకొని, ఆగుంపులో కొందరు డబ్బులు వాయిస్తూ, వంత పాట పాడుచుండగా పాడుపాట.

లింగ, తా! లిల్లే: తా లిల్లే !
తాం; తత్తార పడకుండ; తానె బ్రహ్మము ౹౹లింగ౹౹తా౹౹
ఓరి; ఆది మూలము, బ్రహ్మ, విష్ణు విగ్రహము మీద !
ఆనంద మాడే వాడెవడురా ?
అఖిల దేవతలకు | అభయ మిచ్చి వాఁడు !
అలనాడు గోసంగు ! నేనేనురా ౹౹లింగ౹౹తా౹౹
పసుపు గంధము చాల | పైనిండ బూసుక !
మిసిమి కత్తినిచేత | మేల్ బూనంకొని !
మేల్, మేల్, సలిపిన ! మేటి మృగముల కెల్ల !
నాకత్తి సయ్యాట ! లాడునురా ౹౹లింగ౹౹తా౹౹
మింటి దిక్కును జూచి | మీసంబు వడివేసి !
కొంటె దున్నతల | నరికేనురా !
గొంకక చిందులు ! గోవింద గంతులు !
శంక లేక బలి | చల్లీతిరా ౹౹లింగ౹౹తా౹౹
అండాండ మనుబిరుదు | డాసాదినా పేరు!
పిండాండ మను | బిరుదుకాసె పోసి !
అండ పిండ, బ్ర ! హ్మాండముల కెల్లను !
మెండుండుదై బాలకు |మెండాడురా ౹౹లింగ౹౹తా౹౹

గోసంగులు బ్రహ్మ నాయని సేనలోని మాదిగలు. మాదిగవారు వీరశైవులు. శివరాత్రి నాడు కోటి ఫలి క్షేత్రములో వీరి డప్పుల వాద్యాలతో చెవులు గళ్లు పడును.