ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వియోగము

——ఏకారణమువల్లనో భార్యను పుట్టినింట విడిచివచ్చినాడు యువకుడు. ఆమె అక్కడా ఈతడిక్కడా బాధ పడుతున్నారు,

ఎన్నాళ్ళో, ఈబంధికానాలు; మా కెన్నాళ్ళో ౹౹ఈ౹౹
కదిలివచ్చే నాడే | కారుమబ్బేసింది
కలికిరోనా యెల్లి | వెల వెల బోయింది
కందిన సెక్కిళ్ళ ! కడవలలో బోసింది
కాటుకకన్నీళ్లు | నీలాలు నాయెల్లి ౹౹ఎ౹౹
గడియ సేపయిన సన్ | విడిసినోడుకాడు
పడనారయేడాది ! పాటైనకాలేదు
నడిమంత్రమున యింత | మిడి మేలమైపోయె
కడకునా కాపురము | కడగళ్ళు పొలాయె ౹౹ఎ౹౹
సీలమండా దాక ! సిందాడుతలకట్టు
కలువపూలు జుట్టి ! కడవంత కొప్పెట్టి
పొలుపైన కుంకుమ్ము | బొట్టు కాటుక బెట్టి
గున్న టేనుగు మల్లె | గునగునా నడకలు నాయెల్లి ౹౹ఎ౹౹
వలరాజు అండాల ! వన్నె చిన్నెలరాజు
నిలువెత్తు నట్టిల్లు ; నిండినా రాజు
'మెలిరాని నూనూగు మీసాల నారాజు
కలలో రాతిరివచ్చి . కనిపించి పోయాడు ౹౹ఎ౹౹