ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గొన - గొప్ప 649 గొప్పు - గొఱ
భావచ్ఛాయలలో ప్రయుక్తం.
గొనకొను
- నెలకొను.
- వెడలు ఇత్యాదులలో ప్రయుక్తం. కొన్నిట ఉప స్కారకంగా వినవస్తుంది.
- "గొనకొన్న ప్రేమమై కొలువు చాలించి." రంగ. రా. ఆర. 170. పు.
- "గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు." భార. ఆర. 4. 105.
- "వేఁట నెపమున గొనకొని కణ్వాశ్రమమునకున్ వచ్చి." భార. ఆది. 4. 74.
గొనకొల్పు
- పురికొల్పు.
గొణగొణ లాడు
- గొణుగు. ధ్వన్యనుకరణము.
గొప్ప చేయు
- 1. పెద్ద చేయు.
- "వాళ్ల యింటికి వెళ్లినప్పుడు అతడు న న్నెంతో గొప్ప చేసి గౌరవించాడు." వా.
- 2. పెంచు.
- "కోయకు జీతంబు గొప్ప చేయు." పార్వ. 1. 62.
గొప్ప చేసుకొను
- స్వోత్కర్ష చెప్పుకొను.
- "వా డేమో మహా గొప్ప చేసుకొంటున్నాడు. వాడి సంగతి ఎవడికి తెలియదు?" వా.
గొప్ప మనసు చేసికొను
- ఎక్కువ ఔదార్యమును చూపు.
- "నేనూ అంత ఉన్నవాణ్ణి కాదు. నా చేత నయిన మర్యాద లన్నీ చేశాను. మీ రేదో గొప్ప మనసు చేసుకొని యీ మూడుముళ్లూ పడ నిస్తే జన్మ జన్మాలకూ మీ మేలు మరిచి పోను." వా.
గొప్పు తవ్వి గొయ్యి తవ్వి సంపాదించు
- నానా బాధపడి సంపాదించు.
- "వా డేదో గొప్పు తవ్వి గొయ్యి తవ్వి నాలుగురాళ్లు సంపాయించుకొంటే కొడుకు అది కాస్తా కాజేస్తున్నాడు." వా.
గొబ్బిపదములు
- గొబ్బి తట్టుతూ పాడుకునే పాటలు. పండితా. ప్రథ. వాద. పుట. 513.
- చూ. ప్రభాతపదములు.
గొర్లపాలు సేయు
- పార ద్రోలు - గొఱ్ఱెలను వోలె తోలు.
- "నిశితఖడ్గాయుధాన్వితహస్తుఁ డగుచుఁ, బశువరించుచు గొర్లపాలు సేయుచును." బస. 6. 155.
గొర్ల మంద
- అమాయకులూ, అజ్ఞానులూ అనుట.
- "ఆ ఊళ్లో వాడు చెప్పింది వేదం. ఆ జన మంతా గొర్లమంద కాబట్టి సరి పోయింది. లేకుంటే వీడి ఆట సాగేదా?" వా.
గొఱక వేయు
- ధ్వని చేయు.