ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాజు - గాజు 600 గాజు - గాడి

గాజుపూసకు బంగారు పొదుగు

  • అయోగ్యుని గౌరవించు. అది తగ దనుట. బాలనీతి. 57.

గాజుబన్నరులు

  • గాజుబొమ్మలు.
  • "తరుణులు చిల్క బొమ్మలును దంతపు బొమ్మలు మేలిగాజు బ,న్నరులును మ్రానిచొప్పికలు నల్గడ నోలిన పేర్చి." కుమా. 3. 36.

గాజులను తొడవుగా కల్పించు

  • పౌరుషహీనులను చేసి ఇంట కూర్చుండ బెట్టు; గాజులు తొడుగు.
  • "కలరా యింతకు మున్ను యాదవులచేఁ గప్పంబు దెప్పింపఁగాఁ, గల రారాజులు గాజులం దొడవుగాఁ గల్పించి రా కాకులం, గలకంఠంబులఁ జేసెనా?" ఉ. హరి. 4. 157.

గాజుల పేర్లు రోకలి దాకినట్లు

  • శక్తిహీనులు శక్తిమంతుని ఎదుర్కొనుటలో సామ్యం; తగరు కొండను తాకినట్లు వంటిమాట.
  • "గాజుల పేర్లు రోఁకలి దాఁకుగతి దోఁప, ముంజేత నంగముల్ మోఁది మోఁది." భాస్క. యుద్ధ. 675.

గాజులలంక దున్న

  • సోమరి; స్వేచ్ఛాచారి.

గాజులవాని మర్యాద

  • తనకు తానే చేసుకొను మర్యాద.
  • గాజులవాడు ఎక్కడికి వెళ్ళినా కంబళి కూడా తీసుకొని వెడతాడు. అది వేసుకొని కానీ తాను కూర్చోడు.
  • "ఇదేమిటోయ్ బావా! నిన్ను నీవే పొగుడుకుంటున్నావ్ - గాజులవాని మర్యాదగా ఉందే." వా.

గాజులు తొడుగు/

  • పౌరుషహీనుని చేయు. మగవాని విషయంలో ఉపయోగించే మాట.
  • "వాళ్లందరూ కలిసి వీణ్ణి గాజులు తొడిగి కూర్చో బెట్టారు." వా.

గాజులు తొడుగుకొని కూర్చుండు

  • ఏమీ చేత కాక మూల కూర్చుండు. పౌరుషహీనముగా ఉండు.
  • మగవానివిషయంలోనే దీన్ని ఉపయోగిస్తారు.
  • "వాళ్లంతా నానా హంగామా చేస్తుంటే నువ్వు గాజులు తొడుగుకొని కూర్చుంటే లాభ మే ముంది?"
  • "ఇక్కడ ఎవరూ గాజులు తొడుగుకొని కూర్చో లేదు." వా.

గాడి కట్టు

  • పాదుకొను.
  • "కాంతకు నీకు వలపు గాడి గట్టేని." తాళ్ల. సం. 3. 139.

గాడిదకు గంత గట్టినట్లు

  • అనర్హునికి అప్పగించిన పని యెడల ఉపయోగించే సామ్యం.