ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ట____కృష్ణా 513 కౢప్త____కెక్క


కృష్టపచ్యము

  • దున్నిననేలలో విత్తి పండించే ధాన్యం.
  • ధాన్యం రెండు రకాలు-కృష్టపచ్యము; అకృష్టపచ్యము= తా నంతట పండే గడ్డిగింజల వంటివి.

కృష్ణా అనుకొను

  • చచ్చిపోవు.
  • "ఆ ముసలిది కాస్తా కృష్ణా అనుకొంటే ఆ ఆస్తి అంతా వీడిదే." వా.

కృష్ణార్పణ మగు

  • తనది కాకుండా ఇతరులకు దత్త మై పోవు.
  • "ఏ దయినా దానంగా యిచ్చినప్పుడు కృష్ణార్పణం అనీ, రామార్పణం అనీ దైవప్రీతిగా యిచ్చే అలవాటు కలదు. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "వాడు చదివి తెచ్చిస్తాను అంటే పుస్తకం ఇచ్చాను. అది కృష్ణార్పణం అయి పోయింది." వా.

కృష్ణాష్టమి

  • శ్రావణ బహుళ అష్టమి. ఇదే గోకులాష్టమి. కృష్ణుడు పుట్టిన రోజు.
  • "కృష్ణాష్టమినాడు గౌడీయమఠలో బ్రహ్మాండంగా చేస్తారు." వా.

క్లప్తంగా

  • సంక్షిప్తంగా.
  • "మీరు చెప్పే దేదో కలుప్తంగా చెప్తే మంచింది." వా.

కెం పగు

  • ఎఱ్ఱ నయిన.
  • అనగా కోపోద్రిక్త మయిన.
  • "కెం పగుకన్నుదోయితో." జైమి. 2. 53.

కెం పగుచూడ్కి

  • కోపదృష్టి.
  • "జనపరంపర కెం పగుమాడ్కి జూచి." పాండు. 3. 95.

కెంపు దేఱు

  • ఎఱు పెక్కు.
  • "కన్నుదోయి, తుది గెంపుదేఱు నిద్దుర మంపుతోడ." వర. రా. సుం. పు. 67. పంక్తి. 8.

కెంబసుపు

  • కుంకుమ.
  • "నునుపుగా దువ్వి తీర్చిన కెంపు బాలేందు, పస మీఱు నొసటి కెంబసుపు బొట్టు." శుక. 2. 425.

కెక్కరలు కొట్టు

  • ఆశ్చర్యమును ప్రకటించు. 'గెగ్గరలు కొట్టు' అని నేడు వినబడదు.
  • ధ్వన్యనుకరణము.
  • కుక్కు. 52.
  • "ఆ పిల్ల అత్త నలా అన్నిమాట లంటుంటే అంతా కెక్కరలు కొడుతూ విన్నారు." వా.