ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కర్ణా___కర్ణా 413 కర్ణు____కర్మ

కర్ణాంజలి పుటము లొగ్గు

  • చెవి యొగ్గు; మాటను శ్రద్ధగా విను.
  • "నిజమధుర వచన సుధాసారంబునకు గర్ణాంజలి పుటంబు లొగ్గ నక్కంజ నయన యి ట్లనియె." శుక. 3. 474.
  • చూ. చెవి యొగ్గు.

కర్ణాకర్ణికగా

  • గాలివార్తగా, జనశ్రుతిగా.
  • "అచ్చెలువ నెచ్చెలుల ముచ్చటలవలన గర్ణాకర్ణిక నవ్వార్త మధురలాలస చెలి కత్తెలు విని." కళా. 7. 237.
  • చూ. కర్ణాకర్ణి గా.

కర్ణాకర్ణి గా

  • జనశ్రుతిగా. ఎవరో ఒకరికి చెప్తే. మరొకరికి వారు చెప్తే, అలా ప్రాకినట్టి వార్తల పట్ల ఉపయోగించే మాట.
  • "...తచ్చరిత్రములు నాచే గ్రొత్తగా నేల క,ర్ణాకర్ణిం గథలందు మున్ను వినమే నానాప్రకారంబులన్." ఉ. హరి. 5. 296.
  • "కర్ణాకర్ణిన్ గథలందు మున్ను వినమే." ఉత్త. హరి. 4. 296.
  • "ఆ విషయం నేను కర్ణాకర్ణిగా విన్నాను." వా.
  • చూ. కర్ణాకర్ణి కగా.

కర్ణామృతముగా

  • వీనుల విందుగా.
  • "విమలవాగ్భంగి గర్ణామృతములు గాను." రుక్మా. 1. 51.

కర్ణుడు లేని భారతము

  • అసలు సున్నా అయినది. ముఖ్య మయినదే లోపించినది - అనుట.
  • "నీవే రాకపోతే నీ పెత్తనానికి మేం వెళ్ళడ మేమిటి? కర్ణుడు లేని భారతమా?" వా.

కర్ణునితల భారతము

  • దీని కంతా ప్రధానుడివి నువ్వే అనుపట్ల ఉపయోగించే పలుకుబడి. కర్ణుని తలమీదనే భారతకథ అంతా నిలిచి ఉన్న దనుటపై యేర్పడినది.
  • "నువ్వే యిలా అంటే యెలాగు రా? కర్ణుని తల భారతం అన్నారు." వా.

కర్ణేజపుడు

  • చెవి కొరుకువాడు. ఒకరిపై చాడీలు చెప్పేవాడు.

కర్మ (0) కాలి

  • దురదృష్టవశాత్తూ.
  • "నా కర్మం కాలి వా డక్కడకు వస్తే...ఇంక నా పని అయినట్టే." వా.
  • "వాడి కర్మ కాలి వీనిముందుకే ఆ కాగితం వెళ్లాలా?" వా.

కర్మ కాలిపోవగా

  • విసుగు వేసటలను దెలిపే ఊతపదం.
  • "లంజముండలం, దుత్సుకతాభరమ్ము గొను టొప్పునె కర్మము కాలిపోవగన్." పాణి. 4. 45.