ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకా____ఏకా 274 ఏకా___ఏకు

ఏకాతపవారణముగ

  • ఏకచ్ఛత్రముగా. అడ్డు లేక అనుట. కాశీ. 4. 177.

ఏకాధ్వరమాధుకరంగా

  • చాలీ చాలక.
  • "ఈ సంసారం ఏకాధ్వరమాధుకరంగా ఉంది." వా.

ఏకాడికి

  • ఎంతకు, ఏమాత్రానికి. ఎంతడబ్బుకు అన్నమాట. కొత్త. 12.

ఏకారిగొట్టు

  • ఒక తిట్టు. ప్రతిదానికోసం వేకా రేవా డనుట.

ఏకార్ణవముగా

  • జలమయముగా; ఎక్కడ చూచినా నీళ్ళుగా. దీనిని భూమి - దాని పర్యాయ పదాలతో చేర్చీ ఉపయోగిస్తారు.
  • "ఏకార్ణవంబుగా హెచ్చి వర్షించి." పల. పు. 12.
  • "భూమి అంతా ఏకార్ణవ మయిపోయింది." వా.
  • "ఎక్కడ చూచినా ఏకార్ణవంగా ఉంది. ఏం వానలు ! ఏం వానలు !" వా.

ఏకాహబ్రాహ్మడు

  • నిరసనగా అనుమాట.
  • ఏకాహాలలో బ్రాహ్మణార్థం ఉండేవాడు. అది కొంచెం నీచం అనే భావంపై యేర్పడిన పలుకుబడి.
  • ఏకాహం అంటే మృతునకు పదకొండోరోజు చేసే శ్రాద్ధ కర్మ.
  • "ఆ ఏకాహబ్రాహ్మడే దొరికాడూ నీకు?" వా.
  • చూ. ఏకాహము.

ఏకాహము

  • మృతులకు పదకొండోరోజు చేసే కర్మ.
  • చూ. ఏకాహబ్రాహ్మడు.

ఏకి కాకుల కిచ్చు

  • చించి చెండాడు. తుత్తుమురు చేసి కాకులకు వేయు అనుట.
  • "కండలు తనవింట నేకి కాకుల కిచ్చెన్." కకు. 5. 76.

ఏకు మే కగు

  • మెత్తనివాడే క్రూరు డగు. సులువుగా తీరునది గండ్ర గొయ్యగా తయా రగు.
  • "కాన వివరించితిని మీదికార్యమెట్లు, చక్క చేసెదొ నీయంత పిక్కులాట, మేళగా డెవ్వ డిది మీదుమిక్కి లైన, దీర్ప రా దేకు మేకైన దేవదేవ!" వెంకటే. 2. 21.
  • "ఏదో పని నేర్చుకుంటా నని వచ్చి వాడు ఏకు మేకై కూర్చున్నాడు. నాకే ఉద్వాసన చెప్పేట్టున్నాడు." వా.