ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇల్లా_____ఇల్లు 171 ఇల్లు_____ఇల్లు

ఇల్లాలు

  • గృహిణి.

ఇల్లిగ్గులు

  • సంకోచములు.
  • "ఇల్లిగ్గులు గానవచ్చి హృదయములో నన్." ఉ. హరి. 5. 166.
  • శై. ర. లోనూ - దాని ననుసరించి కావచ్చు వావిళ్లని. లోనూ ఉన్న 'వెనుక కొఱగుంటలు' అన్న అర్థం ఇక్కడ కుదురుట లేదు.

ఇల్లి ముక్కు

  • ముక్కులో నెత్తురు కారే ఒక రోగము.

ఇల్లు ఇరకటం ఇల్లాలు మర్కటం

  • అన్నీ యిబ్బందులే అన్న అర్థంలో ఉపయోగిస్తారు. ఒక సామెతపై వచ్చిన పలుకుబడి.
  • "నా దంతా మహాయిబ్బందిగా ఉంది. ఇల్లు యిరకటం ఇల్లాలు మర్కటం." సా.

ఇల్లు కట్టుకొను

  • శాశ్వతంగా ఉండు.
  • "నిరతమును నిల్లు గట్టుకొ మ్మరుగు మింక." సుకన్య. 39.

ఇల్లు కశలం

  • ఇల్లు ఇరకట మనుట.
  • "ఇల్లు కశలంగా ఉంది." వా.

ఇల్లు కాలా

  • ఒక తిట్టు.
  • 'దాని, వాని' ఇలా కలిపే వాడుక.
  • "వా నిల్లు కాలా." వా.
  • "దానిల్లు కాలా. ఏమిరంపు చేస్తుందమ్మా." వా.

ఇల్లు గట్టుకొను

  • స్థావర మేర్పరచుకొను, నివసించు.
  • "కొడుకులును దోడ రా న,ట్టడవిని నిలు గట్టికొంటి వటరా." పాండవాశ్వ. 33.

ఇల్లు గడచు

  • జీవనము జరగు.
  • "ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇంక ఒకరికి ఏం పెడతాం?" వా.

ఇల్లు గుల్ల చేయు

  • కొంప పాడు చేసుకొను.
  • "ఇల్లు గుల్లగ జేసి యిల్లాలి నెగ రోసి వేశ్యకై యూరూరు వెడలువారు." చింతా. 4. 37.

ఇల్లు చాలదు

  • చాలినంత వసతి లే దనుట.
  • "పిల్ల లందరు వస్తే ఈ యిల్లు చాలదు." వా.

ఇల్లు చెఱచు

  • కులనాశనము చేయు.
  • "బాలికాగ్రగణ్య లీలావతీకన్య, యిల్లు చెఱప బొడమె నేమొ యనుచు." శుక. 1. 459.

ఇల్లు చేరుకొను

  • ఎక్కడి కైనా వెళ్లి తిరిగీ యింటికి వచ్చు.