పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/83

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

పాల్గొన్నారు. సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలుపు చేసిన సందర్భములో జిల్లా కాంగ్రెసు నాయకులు గాని, కాంగ్రెసేతర నాయకులుగాని, జన సామాన్యంకాని ఆయనపై ఇసుమంత విమర్శ చేయటానికి కూడా సాహసించలేదు. కాంగ్రెసు నాయకులు కొందరు స్వరాజ్యపార్టీ ఏర్పాటుచేసినా-జిల్లా నాయకులు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నిర్మాణాత్మక కార్యక్రమాలను నిర్వహించారేగాని స్వరాజ్యపార్టీకి చేయూతనివ్వలేదు. గాంధీజీ నిరాహాదీక్ష చేబడితే జిల్లాలో అనేక మంది తాము కూడ నిరాహార దీక్ష చేశారు. గాంధీజీని ఖైదుచేస్తే ఆయన విడుదలకై అహింసాయుతముగా జిల్లాలో స్త్రీ, పురుషులు అందోళన చేశారు. క్రమంతప్పకుండా ప్రతీ అక్టోబరు రెండవ తేదీన ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. ప్రతీ పర్యాయము గాంధీజీ ఊహించిన దానికంటె హెచ్చు మొత్తాలను పికెటింగుచేశారు. ఆ ఉద్యమకాలంలో జిల్లాయందు మహిళ అరెస్టుకాని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. గాంధీజీని జిల్లాలో సందర్శించిన వయోవృద్దులు నేటికినీ తాముపొందిన మహత్తరమైన అదృష్ణాన్ని పదే పదే తలచుకొంటూ, తమ పిల్లలకు, మనుమలకు ఉప్పొంగే ఆనందంతో చెబుతుంటారు. తమ జన్మ చరితార్థమైనట్టు భావిస్తారు.

గాంధీజీ పర్యటించినంత ఎక్కువగా భారత దేశమంతా పర్యటించి ప్రజల యోగక్షేమములను, ఆర్థికస్థితిగతులను అవగాహన చేసుకొని, అంత అధికంగా వారికి సేవ చేసిన భారతీయుడు ఇంకొకరులేరని చెప్పవచ్చును. స్వరాజ్య సాధనకు పూనుకొనడమంటే సామ్రాజ్యవాద తత్వాన్ని వలస తత్వాన్ని ఎదిరించటం. అంతేకాని ఒక వ్యక్తినో, ఒక జాతినో, మరొక దేశపు ప్రజలనో ప్రతిఘటించటం కాదు అని గాంధీజీ పేర్కొన్నారు. ఆయన చరఖాకు, ఖాదీకి, గ్రామపరిశ్రమలకు ప్రాముఖ్యమిచ్చారు. ఆయన చరఖాను ప్రజల దృష్టిలో ఒక ఆర్థిక సంకేతముగా, విప్లవ చిహ్నంగా రూపొందించారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఆర్థిక చిహ్నంకంటే విప్లవ చిహ్నంగానే ఖాదీపరిశ్రమకు ప్రాముఖ్యం ఉండేది. గాంధీ టోపీ, ఖద్దరు ధారణ కాంగ్రెసు వాదులకు వన్నెతెచ్చాయి. ఖద్దరుధరించిన వారు శాంతికాముకులనీ, గాంధేయవాదులని, సౌజన్యమూర్తులని భారతీయసమాజంలో ఒక గుర్తింపు వచ్చింది.

గాంధీజీ ప్రభావం దేశంలో ఇంద్రజాలం వలె వ్యాపించినది. ఆయన కంఠంలో ఒక అద్భుతశక్తి ఉంది. అది ఇతరులలో ధైర్యం కలిగించేది. వారిలో దేశభక్తిని రెచ్చగొట్టి

84