ఈ పుట ఆమోదించబడ్డది

832

ఒక యోగి ఆత్మకథ

దేశాల లోకవ్యవహార దక్షత అలవరుచుకోవడంవల్ల గొప్పగా లాభం పొందగలవు. అందుకు భిన్నంగా, పాశ్చాత్యులు, జీవితానికున్న ఆధ్యాత్మిక ప్రాతిపదికను, ముఖ్యంగా మానవుడికి దేవుడితో స్పృహతో కూడిన ఐక్యానుసంధానం జరగడంకోసం పురాతనకాలంలో భారతదేశం రూపొందించిన శాస్త్రీయపద్ధతుల్ని గాఢంగా అవగాహన చేసుకోవలసిన అవసరం ఉంది.

సర్వసమగ్ర నాగరికత అనే ఆదర్శం అపోహ ఏమీ కాదు. అనేక వేల సంవత్సరాలపాటు భారతదేశం, ఆధ్యాత్మిక తేజస్సుకూ విస్తారమైన భౌతిక సంపత్తికి కాణాచిగా ఉండేది. భారతదేశం సుదీర్ఘ చరిత్రలో, గత 200 సంవత్సరాల పేదరికమూ కర్మానుసారంగా కలిగిన తాత్కాలిక అవస్థ. “భారతదేశ సంపదలు” అన్నది,[1] శతాబ్దాల తరబడిగా ప్రపం

  1. భారతదేశం 18 శతాబ్దివరకు ప్రపంచంలో అన్ని దేశాలకన్న సంపన్న దేశమని చారిత్రకాధారాలు నిరూపిస్తున్నాయి. పైగా, తొలికాలపు ఆర్యులు ఆసియాలో మరో చోటినించో, యూరప్‌నుంచో భారతదేశం మీదికి “దండెత్తి వచ్చా” రంటూ చెప్పే ఇప్పటి పాశ్చాత్య చారిత్రక సిద్ధాంతాన్ని హైందవ సాహిత్యంలో కాని, సంప్రదాయంలో కాని ఏదీ నిరూపించడానికి ఉపకరించదు. ఊహాప్రాయమైన ఈ ప్రయాణం మొదలైన స్థానాన్ని పండితులు నిర్ధారణ చేసి చెప్పలేక పోతున్నారు; ఈ సంగతి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. భారతదేశం హిందువులకు బహుపురాతన కాలంనుంచి నివాసస్థానంగా ఉంటూ వస్తున్నదన్న విషయాన్ని సూచిస్తూ, వేదాల్లో ఉన్న అంతస్సాక్ష్యాన్ని, అవినాశ్ చంద్ర దాస్‌గారు రాసిన ‘ఋగ్వేదిక్ ఇండియా’ [ఋగ్వేదకాలపు భారతదేశం] అన్న గ్రంథంలో వివరించడం జరిగింది. ఇది చాలా అసాధారణమైన గ్రంథం; హాయిగా చదివిస్తుంది: దీన్ని 1921 లో కలకత్తా విశ్వవిద్యాలయంవాళ్ళు ప్రచురించారు. భారతదేశం నుంచి వలసపోయినవాళ్ళు యూరప్‌లోనూ ఆసియాలోనూ వివిధ ప్రదేశాల్లో స్థిరపడి, ఆర్యభాషనూ జానపదవిజ్ఞానాన్నీ వ్యాప్తిచేస్తూ వచ్చారని ప్రొఫెసర్ దాస్ వాదం. ఉదాహరణకు, లిథూనియా భాషకు చాలా విధాలుగా, సంస్కృతంతో పోలిక కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. సంస్కృతమేమీ దాని కాంట్ అనే తాత్త్వికుడు, లిథూనియా భాషకుగల శాస్త్రీయమైన నిర్మాణాన్ని చూసి అప్రతిభుడయాడు. “భాషాశాస్త్రానికే కాకుండా చరిత్రకు కూడా సంబంధించిన అనేక రహస్యాల్ని ఛేదించే కీలకం అందులో ఉంది.” అన్నాడాయన.

    భారతదేశ సంపదలగురించి ప్రస్తావిస్తూ బైబిలు (II క్రానికిల్స్ 9 : 21.10,, “తార్షీష్” ఓడలు, “బంగారం, వెండి, దంతం, కోతులు, నెమళ్ళు” మాత్రమే కాకుండా, అల్గం (చందనం ) చెట్లకొయ్య, రత్నాలు కూడా సమృద్ధిగా, ఓఫిర్ (బొంబాయి సముద్రతీరంలో ఉన్న సోపారా) నుంచి తెచ్చి

    సాలమన్ రాజుకు ఇచ్చాయని చెబుతోంది. గ్రీకు రాయబారి మెగస్తనీస్ (క్రీ.పూ 4 శతాబ్ధి), భారతదేశ సౌభాగ్యాన్ని గురించి వివరంగా రాసి పెట్టాడు. రోమన్లు, అప్పట్లో బ్రహ్మాండమైన నౌకాబల సంపన్నంగా ఉన్న భారతదేశం నుంచి చేసుకునే దిగుమతుల నిమిత్తం, ఏడాదికి ఐదు కోట్ల సెస్టెర్సులు (5,000,000 డాలర్లు) ఖర్చు పెట్టేవారని ప్లినీ (క్రీ. శ. 1 శతాబ్ది) అంటాడు. సుసంపన్నమైన భారతీయ నాగరికత గురించి, సువ్యాప్తమైన విద్యను గురించి, అద్భుతమైన ప్రభుత్వపాలన గురించి చైనా యాత్రికులు వివరంగా రాశారు. ఫాహియాన్ (ఐదో శతాబ్ది) అనే చైనా పురోహితుడు, భారతదేశ ప్రజలు హాయిగా, విశ్వాసపాత్రులుగా, భోగభాగ్యాలతో వర్ధిల్లుతున్నారని చెబుతున్నాడు. శామ్యుల్ బీల్ (Samuel Beal), “బుద్ధిస్ట్ రికార్డ్స్ ఆఫ్ ది వెస్టర్న్ వరల్డ్” అనే పేరుతో, పాశ్చాత్య ప్రపంచ బౌద్ధ లిఖిత పత్రాల గురించి (ఇక్కడ భారతదేశమే. చైనావాళ్ళకు “పాశ్చాత్య ప్రపంచం”) రాసిన గ్రంథం చూడండి. టన్నల్, లండన్ , అలాగే, థామస్ వాటర్స్, (Thomas Watters) అనే ‘యువాన్ చ్వాంగ్స్ ట్రావెల్స్ ఇన్ ఇండియా’ అనే పేరుతో, యువాన్ చ్వాంగ్ భారతదేశ యాత్రలగురించి రాసిన గ్రంథం కూడా చూడండి; క్రీ. పూ. 629- 45, రాయల్ ఏషియాటిక్ సొసైటీ). కొలంబస్ 15 శతాబ్దిలో నూతన ప్రపంచాన్ని కనిపెట్టే సందర్భంలో, నిజానికి అతడు అన్వేషిస్తున్నది, భారతదేశానికి మరింత దగ్గరి వర్తకమార్గం. భారతదేశంనుంచి ఎగుమతి అయే - పట్టుబట్టలు, నునుసన్నని బట్టలు (“నేసిన” గాలి, “కంటబడని పొగమంచు” అన్న వర్ణనలకు సరిగా తగినవి), నూలు అద్దకం బట్టలు, బ్రోకేడ్లు, కసీదాలు, కంబళ్ళు, కత్తులూ, చాకులూ వంటి కోత సామగ్రి, దంతం, దంతం నగిషీ సామగ్రి పరిమళ తైలాలు, ధూపసామగ్రి, చందనం కర్ర, మట్టిపాత్రలు, ఓషధులు, లేపనాలు, నీలిమందు, బియ్యం, మసాలా వస్తువులు, పగడాలు, బంగారం, ముత్యాలు, కెంపులు, పచ్చలు, వజ్రాలు కొనుక్కోవాలన్న లాలస, యూరప్‌కు అనేక శతాబ్దాలపాటు ఉండేది. విజయనగర సామ్రాజ్య మంతటా కనిపించే అతులిత వైభవాన్ని చూసినప్పుడు తమకు కలిగిన ఆశ్చర్యాన్ని గురించి పోర్చుగల్లు, ఇటలీదేశాల వర్తకులు రాసి పెట్టారు. ఆ సామ్రాజ్య రాజధాని వైభవాన్ని వర్ణిస్తూ, అరేబియా రాయబారి రజాక్ , “భూమిమీద దానికి సమానమైన చోటు మరేదీ కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు,” అంటూ రాశాడు.

    భారతదేశ సుదీర్ఘ చరిత్రలో మొట్టమొదటిసారిగా 16 శతాబ్దిలో, దేశమంతా హైందవేతరుల పాలనలో పడింది. టర్కీదేశపు బాబరు 1524 లో భారతదేశం మీద దాడిచేసి ముస్లిం రాజవంశాన్ని స్థాపనచేశాడు. ఈ ప్రాచీన భారతదేశంలో స్థిరపడ్డ కారణంగా కొత్తరాజులు, ఇక్కడి సంపదల్ని బయటికి తీసుకు వెళ్ళలేదు. అంతఃకలహాలవల్ల బలహీనమైపోయినప్పటికీ, సంపన్నమైన భారత

    దేశం, 17 శతాబ్దిలో అనేక యూరప్ దేశాలకు ఎర అయింది; చివరికి ఇంగ్లండు పాలకదేశంగా పరిణమించింది. 1947 ఆగస్టు 15 న భారతదేశం ప్రశాంతంగా స్వాతంత్ర్యం పొందింది.

    చాలామంది భారతీయులకున్నట్టుగానే నాకు కూడా, ‘ఇప్పుడిక చెప్పవచ్చు’ ననిపించే కథ ఒకటి ఉంది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో, కాలేజిలో నాకు తెలిసిన యువకులు కొందరు నా దగ్గరికి వచ్చి, ఒక విప్లవోద్యమానికి నాయకత్వం వహించమని నన్ను కోరారు. దానికి జవాబుగా, “మన ఆంగ్ల సోదరుల్ని చంవడంవల్ల భారతదేశానికి మేలేమీ జరగబోదు. దీనికి స్వాతంత్ర్యం వచ్చేది, ఆధ్యాత్మిక శక్తివల్లే కాని, తుపాకిగుండ్ల ద్వారా కాదు,” అని చెబుతూ దాన్ని నిరాకరించాను. ఆయుధాలు తీసుకువస్తున్న జర్మనీ ఓడల్ని నమ్ముకున్నారు మా స్నేహితులు; వాటిని బ్రిటిష్ వాళ్ళు, బెంగాలులో డైమండ్ హార్బర్ దగ్గర అటకాయించడం జరుగుతుందని నేను వాళ్ళకి చెప్పాను. అయినప్పటికీ ఆ యువకులు తమ పథకాలు సాగించారుకాని, చివరికి నేను చెప్పినట్టే జరిగింది. కొన్నేళ్ళ తరవాత మా స్నేహితులు జైలునుంచి విడుదల అయారు. వాళ్ళలో చాలామంది హింసాత్మక చర్యల మీద తమకున్న దృఢ విశ్వాసాల్ని వదలుకొని, గాంధీమహాత్ముల ఆదర్శవంతమైన రాజకీయోద్యమంలో చేరారు. చివరికి, విశిష్ట “యుద్ధాన్ని” శాంతియుతంగా జయించిన భారతదేశ విజయాన్ని వాళ్ళు కళ్ళారా చూశారు. దురదృష్టవశాత్తు దేశం, భారత పాకిస్తానులుగా చీలిపోవడం, ఆ తరవాత దేశంలో కొన్నిచోట్ల - కొద్దికాలమే అయినా- రక్తపాతం జరగడం అన్నవి, ఆర్థిక కారణాల వల్ల జరిగినవే కాని, ప్రధానంగా మతోన్మాదం వల్ల జరిగినవి కావు. (పొరపాటున, అప్రధాన కారణాన్ని ప్రధాన కారణంగా చూపెట్టడం జరుగుతోంది). పూర్వకాలంలో మాదిరిగానే ఇప్పటికీ కూడా, అసంఖ్యాకులైన హిందువులూ ముస్లిములూ సామరస్యంగా ఇరుగుపొరుగుల్లోనే నివసిస్తున్నారు. ఈ ఉభయ మతానుయాయుల్లోనూ, అనేకమంది, “మతశాఖారహిత” గురువైన కబీరు (1450-1518) కు శిష్యులయారు; ఈనాటి వరకు కూడా ఆయనకు లక్షలాది మంది అనుయాయులుగా, ఉంటూ వస్తున్నారు (కబీర్ పంథీలు). అక్బరు చక్రవర్తి ముస్లిం పాలనకాలంలో భారతదేశమంతటా మతవిశ్వాస స్వాతంత్ర్యం వీలయినంత ఎక్కువగా ఉండేది. ఈనాటికీ, 95% మంది, నిరాడంబర జనుల్లో తీవ్రమైన మతవైషమ్యం లేదు. నిజమైన భారతదేశం, ఒక గాంధీ మహాత్ముణ్ణి అర్థం చేసుకొని ఆయన్ని అనుసరించగల భారతదేశం కనిపించేది, అశాంతితో నిండిన పెద్ద నగరాల్లో కాదు: 70,000 ప్రశాంతమైన పల్లెల్లో , అక్కడ పంచాయతుల (స్థానిక పాలన మండలులు) ద్వారా సరళంగా, న్యాయంగా పరిపాలన జరగడమన్నది అత్యంత ప్రాచీనకాలంగా సాగుతూవస్తున్న సంప్రదాయం. కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి ఈనాడు ఎదురవుతున్న సమస్యల్ని కాలక్రమంలో, మహాపురుషులు పరిష్కరిస్తారు, అటువంటివాళ్ళని భారతదేశం కనకపోవడం లేదు