ఈ పుట ఆమోదించబడ్డది

పడమటికి నా తిరుగుప్రయాణం

813

తెచ్చిన కానుకలు - పాలస్తీనా, ఈజిప్టు, భారతదేశం, ఇంగ్లండు, ఫ్రాన్సు, ఇటలీ దేశాలనుంచి తెచ్చినవి. అమెరికాలోని ప్రేమాస్పదులకోసం ఉద్దేశించిన ఈ నిధుల్ని, ఏ దొంగ చేతికి చిక్కకుండా కాపాడ్డం కోసం, వాటిని భద్రపరిచిన పెట్టెల్ని ప్రతి విదేశపు కూడలిలోనూ శ్రీరైట్ ఎంత శ్రమతీసుకుని లెక్క పెడుతూ ఉండేవాడో! పుణ్యభూమి పాలస్తీనా నుంచి పవిత్రమైన ఆలివ్ ధాతుఫలకాలు, బెల్జియం హాలండ్‌ల నుంచి నాజూకు లేసులూ కసీదాలూ, పెర్షియన్ తివాసీలూ సున్నితంగా నేసిన కాశ్మీరు శాలువలూ, మైసూరు నుంచి తెచ్చిన గంధపుచెక్క పళ్ళాలు, మధ్య పరగణాల నుంచి “నంది కంటి” రాళ్ళు, ఏనాడో గతించిన భారతీయ రాజవంశాల వాళ్ళ నాణేలూ, రత్నఖచితమైన పూల కూజాలూ కప్పులూ సూక్ష్మచిత్రాలూ, గోడలకు వేలాడదీసే పటచిత్రాలూ, పూజా పరిమళద్రవ్యాలూ, డిజైన్లు అద్దిన స్వదేశీ నూలు అద్దకంబట్టలూ, లక్క సామగ్రీ, మైసూరు దంతం నగిషీ సామగ్రీ, మొనదేలిన పొడుగాటి పెర్షియన్ చెప్పులూ, అపురూప చిత్రరచనగల రాతప్రతులూ, ముఖమల్‌బట్టలూ, బ్రాకేడ్లూ, గాంధీ టోపీలూ, పింగాణి పాత్రలూ, ఇత్తడి సామానూ, ప్రార్థనకు కూర్చోడానికి వేసుకొనే గొంగళ్ళూ- ఒక టేమిటి, మూడు ఖండాలనుంచి కొల్లగొట్టుకు వచ్చిన సామగ్రి వాటిలో ఉంది.

చెట్టుకింద పేర్చిన పెద్ద గుట్టలోంచి అందంగా ఆచ్ఛాదన చేసి, పెట్టిన పెట్టెలు తీసి ఒకదాని తరవాత ఒకటి పంచిపెట్టాను.

“సిస్టర్ జ్ఞానమాతా!” మృదుస్వభావమూ గౌరమైన ఆత్మ దర్శనమూ కలిగిన సాధువర్తనురా లీమె; నేను దేశంలో లేని సమయంలో మౌంట్ వాషింగ్టన్ కేంద్రం నిర్వహణ భారం వహించిన ఈ అమెరికా మహిళకు పొడుగాటి పెట్టె ఒకటి అందించాను.