ఈ పుట ఆమోదించబడ్డది

నిరాహార యోగిని

807

విసర్జనలు లేవు. గుండె కొట్టుకోడాన్నీ ఊపిరి ఆడడాన్నీ నేను అదుపులో ఉంచుకోగలను. అంతర్దర్శనాల్లో తరచుగా నేను, నా గురుదేవుల్నీ ఇతర మహాత్ముల్నీ చూస్తూంటాను.”

“అమ్మా, మీరు, తిండిలేకుండా జీవించే విధానాన్ని ఇతరుల కెందుకు నేర్పగూడదు?” అని అడిగాను.

ప్రపంచంలో తిండిలేక మాడే కోట్లాది ప్రజల మేలుకోసం నేను పెట్టుకొన్న మహత్తరమైన ఆశలు ఇట్టే భగ్నమయిపోయాయి.

“ఊఁహుఁ,” అంటూ తల తిప్పారావిడ. “ఈ రహస్యం ఎవరికీ వెల్లడించగూడదని గట్టిగా ఆదేశించారు, నా గురుదేవులు. భగవంతుడి లీలారూప జగన్నాటకంతో నేను జోక్యం చేసుకోడం ఆయన అభిమతం కాదు. తిండి తినకుండా ఉండడం ఎలాగో, నేను కనక చాలామందికి నేర్పేసినట్టయితే, రైతులు నా కేమీ ధన్యవాదాలు చెప్పరు! తియ్య తియ్యని పండ్లు నిరుపయోగంగా నేలమీద పడి ఉంటాయి. దైన్యం, ఆకలి, చావు అన్నవి, జీవితానికి నిజమైన అర్థాన్ని అన్వేషించడానికి, చివరికి మనను తరిమే కర్మసంబంధమైన కొరడాలుగా కనిపిస్తాయి.”

“అమ్మా, మీ రొక్కరే తిండి తినకుండా ఉండిపోవడంవల్ల ఉపయోగమేమిటి?” అని మెల్లగా అడిగాను.

“మానవుడు ఆత్మ అని నిరూపించడానికి.” ఆవిడ ముఖం జ్ఞాన దీప్తితో వెలుగొందింది. “అతడు అన్నంవల్ల కాకుండా, శాశ్వత కాంతివల్ల జీవించడం ఎలాగో, దివ్య ప్రగతి సాధనలో క్రమంగా తెలుసుకో గలిగేటట్టు నిరూపించడానికి.”[1]

  1. గిరిబాలగారు సాధించిన నిరాహారస్థితి, పతంజలి ‘యోగసూత్రాలు’ 11 : 31 లో పేర్కొన్న యోగశక్తి [“కంఠకూపే క్షుత్పిపాసా నివృత్తిః”]. ఆవిడ, వెన్నులో ఉన్న సూక్ష్మశక్తుల తాలూకు ఐదో కేంద్రమయిన ‘విశుద్ధ చక్రాన్ని’ సంయమం చేసే ప్రాణాయామ ప్రక్రియ ఒకటి చేస్తారు. గొంతుక్కి వెనకాలవైపు ఉండే విశుద్ధచక్రం, శరీర కణాల అణువుకూ అణువుకూ మధ్య ఉండే అంతరాల్లో వ్యాపించి ఉండే, ఐదో తత్త్వమైన ‘ఆకాశాన్ని’ సంయమంచేస్తుంది. ఈ చక్రంమీద మనస్సును కేంద్రీకరింపజేసిన యోగి, ఆకాశశక్తివల్ల జీవించగలుగుతాడు.

    థెరిసా నాయ్‌మన్, భౌతికమైన ఆహారంవల్లకాని, నిరాహార జీవనానికి ఉపకరించే శాస్త్రీయ యోగ ప్రక్రియ తాలూకు అభ్యాసాలవలకాని బతకలేదు. దీనికి వివరణ, వైయక్తిక కర్మతాలూకు గజీబిజీలో మరుగుపడి ఉంది. ఒక థెరీసా నాయ్‌మన్‌కు కాని, ఒక గిరిబాలకు కాని, అనేక పూర్వజన్మల దైవాంకిత జీవనం ఉండి ఉంటుంది; కాని బాహ్యాభివ్య క్తికి వాళ్ళవాళ్ళ మార్గాలు వేరువేరుగా ఉంటాయి. తిండిలేకుండా జీవించిన క్రైస్తవ సాధువుల్లో (వాళ్ళు కూడా, ఏసుక్రీస్తు క్షతచిహ్న ధారిణులైన ‘స్టిగ్మాటిస్ట్’ లే) చెప్పుకోవలసిన వాళ్ళు: షీడామ్ వాస్తవ్యురాలైన సెంట్ లిడ్వినా, రెంట్ వాస్తవ్యురాలైన పుణ్యశీల ఎలిజబెత్, సీనా వాస్తవ్యురాలైన సెంట్ కాథరైన్, డొమినికా లాజారీ, ఫోలిగ్నో వాస్తవ్యురాలైన పుణ్యశీల ఏంజిలా, 19 శతాబ్ది లూయిస్ లాటో. సమైక్యంకోసం, ప్రగాఢమైన అభ్యర్థన చేసి స్విట్జర్లాండ్ రాజ్యసమాఖ్యను కాపాడిన, 15 శతాబ్ది నాటి సన్యాసి ప్లూ వాస్తవ్యుడైన సెంట్ నికోలాస్ (బ్రూడర్ క్లాస్) ఇరవైఏళ్ళ పాటు నిరాహారిగా ఉండిపోయాడు.