ఈ పుట ఆమోదించబడ్డది

794

ఒక యోగి ఆత్మకథ

మే మయిదుగురం చిన్న పిల్లల్లా, ఆ మామిడిపళ్ళు పడ్డ నేలమీదికి ఉరికాం; పండ్లు ముగ్గి ఉండడంవల్ల ఆ చెట్టు ఘనంగా రాల్చింది.

“ఎన్నో మామిడి పళ్ళు ఎవరికంటా పడకుండా నేలమీద రాలి పోవడానికే పుట్టాయి; రాతిగొట్టు నేలమీద తమ మాధుర్యాన్ని వ్యర్థం చేసుకోడానికే పుట్టాయి,” అంటూ ఉదాహరించాను.

“అమెరికాలో ఇల్లాంటి దేమీ ఉండదు కదండి, స్వామీజీ?” అంటూ నవ్వాడు, నా బెంగాలీ విద్యార్థుల్లో ఒకడు, శైలేశ్ మజుందార్.

“ఉండదు,” అని ఒప్పుకున్నాను, మామిడిపండ్ల రసం పీల్చుకొని తృప్తిపడి. “పడమటి దేశాల్లో వీటిని ఎంత పోగొట్టుకున్నానో మామిడిపండ్లు లేని స్వర్గం హిందువు ఊహకే అందదు!”

ఒక రాయి విసిరి చిటారు కొమ్మనున్న చక్కటి పండు ఒకటి రాలగొట్టాను.

ఉష్ణదేశపు ఎండకు వెచ్చగిలిన అమృత ఫలాన్ని కొరుక్కుతింటున్నవాణ్ణల్లా మధ్యలో ఆగి, “డిక్, కెమేరాలన్నీ కారులో ఉన్నాయా?” అని అడిగాను.

“ఉన్నాయండి; సామాన్ల అరలో ఉన్నాయి.”

“గిరిబాలగారు నిజమైన యోగిని అని కనక రుజువయితే, ఆవిణ్ణి గురించి పడమటిదేశంలో రాస్తాను. అటువంటి ఉత్పేరక శక్తులు గల హిందూయోగిని - ఈ మామిడిపళ్ళలో చాలావాటి మాదిరిగా - అజ్ఞాతంగా పుట్టి గతించి పోగూడదు.”

అరగంట గడిచాక కూడా, నే నింకా ఆ శాంతిధామంలోనే విహరిస్తున్నాను.