ఈ పుట ఆమోదించబడ్డది

62

ఒక యోగి ఆత్మకథ

రానియ్యకుండా ఒక పోలీసు స్టేషనులోకి తీసుకువెళ్ళాను. అంతకుముందే నే నక్కడ, భయంకరంగా కనిపించే ఆఫీసర్లని ఏరి కోరి ఉంచాను. మేము వెళ్ళగానే వాళ్ళు వాణ్ణి చుట్టుముట్టారు. వాళ్ళ వాడి చూపులకు తట్టుకోలేక జతీన్‌దా, తన వింత నడవడికి సంజాయిషీ చెప్పుకోడానికి ఒప్పుకున్నాడు.”

“ఆధ్యాత్మికమైన ఉత్సాహంతో మనస్సు తేలిపోతూండగా, హిమాలయాలకు వెళ్ళాలని బయల్దేరాను,” అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. గొప్ప గురువుల్ని కలుసుకోగల అవకాశం దొరుకుతుందన్న ఆశతో నా మనస్సు నిండిపోయింది. కాని ముకుందుడు , “హిమాలయ గుహల్లో మనం ఆనందంలో తన్మయులమై ఉన్నప్పుడు , పెద్దపులులు మంత్రానికి కట్టుబడ్డట్టుగా అయిపోయి, పెంపుడు పిల్లుల్లా మనచుట్టూ కూర్చుంటాయి,” అని అనేసరికి నా ఉత్సాహమంతా నీరుగారిపోయింది; నుదుట చెమట పట్టేసింది. “అప్పుడేం గతి?” అని వాపోయాను. “ఒకవేళ పులుల క్రూర స్వభావం మా ధ్యానసమాధి శక్తి ప్రభావవల్ల మారకపోతే మమ్మల్ని అవి, పెంపుడు పిల్లుల్లా దయతో చూస్తాయా?” అన్న ఆలోచన నాలో కలిగింది. ఏదో ఒక పులి పొట్టలోకి నేను బలవంతాన ప్రవేశించినట్టు మనస్సుకు అనిపించింది. అది కూడా పూర్తి శరీరంతో కాదు, శరీరంలోని ఒక్కొక్క భాగమే విడివిడిగా!”

ప్రయాణం మధ్యలో జతీన్‌దా మాతో చెప్పకుండా మాయమైనందుకు అప్పుడు నాకు కలిగిన కోపం, ఇప్పుడు వచ్చిన నవ్వుతో ఎగిరి పోయింది. అన్నయ్య రైల్లో ఇచ్చిన ఉల్లాసకరమైన ఈ వివరణ, జతీన్‌దా నాకు కలిగించిన బాధనంతనీ పోగొట్టేసింది. కాని ఉన్నమాట చెప్పాలి; ఒక్క రవ్వ తృప్తిలాంటిది కూడా కలిగింది నాకు: జతీన్‌దా కూడా పోలీసుల బెడద తప్పించుకోలేకపోయినందుకు!