ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 45

బెంగాలీ “ఆనందమయి మాత”

“నిర్మలాదేవిని ఒక్కసారి చూడకుండా మాత్రం ఇండియా నుంచి వెళ్ళకండి. ఆవిడ భగవద్భక్తి గాఢమైనది. ‘ఆనందమయి మా’గా ప్రసిద్ధి పొందారావిడ.” మా మేనకోడలు అమియా బోస్ నిండు మనస్సుతో నావేపు చూస్తూ అన్నది.

“అలాగే! ఆ సాధ్విని తప్పకుండా చూడాలని నాకూ మనస్సులో ఉంది,” అంటూ ఇంకా ఇలా అన్నాను: “దైవసాక్షాత్కార సాధనలో ఆవిడ చేరిన ఉన్నతస్థితిని గురించి చదివాను. కొన్నేళ్ళ కిందట ‘ఈస్ట్-వెస్ట్’ పత్రికలో ఆవిణ్ణి గురించి ఒక చిన్న వ్యాసం వచ్చింది.

“ఆవిణ్ణి నేను దర్శించుకున్నాను,” అంటూ ఇలా చెప్పింది అమియా; “ఆవిడ ఈమధ్య మా ఊరు- జెంషెడ్‌పూరు వచ్చారు. ఒక శిష్యుడి విన్నపాన్ని మన్నించి ఆనందమయి మాత, అవసాన దశలో ఉన్న ఒకతని ఇంటికి వెళ్ళారు. ఆవిడ అతని మంచం దగ్గర నించున్నారు; అతని నుదుటి మీద చెయ్యి వేసేసరికి అతని మరణవేదన అంతమయింది; వెంటనే జబ్బు మాయమయింది; తన ఆరోగ్యం మెరుగవడం చూసి ఆశ్చర్యపోతూ ఆనందించాడతను.”

కొన్నాళ్ళ తరవాత ఆనందమయి మాత, కలకత్తాలో భవానీపూర్ పేటలో ఒక శిష్యుడి ఇంట్లో బసచేశారని విన్నాను. వెంటనే నేనూ, శ్రీ రైటూ కలిసి కలకత్తాలో మా నాన్నగారి ఇంటిదగ్గర్నించి బయలు