ఈ పుట ఆమోదించబడ్డది

774

ఒక యోగి ఆత్మకథ

“మహాత్మాజీ, మీ రయితే అసాధారణ వ్యక్తులు. మీరు చేసినట్టే లోకం చెయ్యాలని ఆశించగూడదు,” అన్నాడొక విమర్శకుడు ఆయనతో.

“శరీరాన్ని మెరుగుపరుచుకోగలంగాని ఆత్మకున్న గుప్తశక్తుల్ని మేల్కొలపడం అసాధ్యమని మనని మనం ఎంత భ్రమ పెట్టుకుంటామో చూస్తే విడ్డూరంగా ఉంటుంది,” అని జవాబిచ్చారు గాంధీగారు. “అటువంటి శక్తుల్లో ఏదయినా ఒకటి ఉన్నట్లయితే, మనలో అందరిలాగే నేనూ దుర్బల మర్త్యుణ్ణేననీ, నాలో అసాధారణమైన దేదీ వెనకకాని ఇప్పుడుకాని లేదనీ నిరూపించడానికే నేను ప్రయత్నిస్తున్నాను. ప్రతి సాటిమనిషి లాగే నేను కూడా సహజంగా తప్పులు చేసే సామాన్య వ్యక్తినే. అయితే నేను నా తప్పుల్ని ఒప్పుకొని, వాటిని సరిదిద్దుకోడానికి కావలసినంత వినయం ఉన్నవాణ్ణని అంగీకరిస్తాను. భగవంతుడి మీదా ఆయన మంచి తనం మీదా నాకు అచంచలమైన విశ్వాసం, సత్యంకోసమూ ప్రేమకోసమూ అవ్యయమైన ఆకాంక్ష ఉన్నాయని ఒప్పుకుంటాను. కాని ఇది ప్రతిమనిషిలోనూ అంతర్నిహితంగా లేదా?” - అంటూ ఆయన ఇంకా అన్నారు: “దృగ్విషయిక ప్రపంచంలో మనం కొత్త ఆవిష్కరణలూ నూతన కల్పనలు రూపొందిస్తూంటే, ఆధ్యాత్యిక రంగంలో మన దివాళా కోరుతనాన్ని చాటి చెప్పుకోవాలా? అపవాదాల్ని ఒక సూత్రంగా చెయ్యడానికి వాటి సంఖ్యను గుణించుకుంటూ పోవడం అసాధ్యమా? అంతగా అయితే మనిషి, మొదట ఆటవికుడయిన తరవాతే మనిషి కావాలా?”[1]

  1. గొప్ప ఎలక్ట్రికల్ ఇంజినియరుగా పేరు పొందిన ఛార్లెస్ పి. స్టీన్ మెట్జ్‌ను శ్రీ రోజర్ డబ్ల్యు. బాబ్సన్ ఒకసారి ఇలా అడిగాడట :

    “వచ్చే యాభై ఏళ్ళలో మహత్తర అభివృద్ధి సాధించే పరిశోధన రంగం ఏమిటి?” దానికి స్టీన్‌మెట్జ్, “ఆధ్యాత్మిక మార్గాల్లో మహత్తరమైన ఆవిష్కరణ జరుగుతుందనుకుంటాను,” అని జవాబిచ్చాడు. “మానవుల వికాసంలో మహత్తర శక్తి ఉందని స్పష్టంగా చరిత్ర ఉద్ఘాటించే బలం ఇక్కడ ఉంది. అయినా కూడా మన మిప్పటికీ దాంతో ఆడుకుంటున్నామే కాని, భౌతిక శక్తుల్ని అధ్యయనం చేసిన మాదిరిగా, దాన్ని ఎన్నడూ తీవ్రంగా అధ్యయనం చెయ్యలేదు. భౌతిక వస్తువులు సుఖాన్ని ఇచ్చేవనీ స్త్రీపురుషుల్ని సృజనశీలంగానూ శక్తిమంతంగానూ చెయ్యడంలో అవి నిరుపయోగమైనవనీ ఎప్పటికో ఒకనాటికి ప్రజలు తెలుసుకుంటారు. అప్పుడు ప్రపంచంలో విజ్ఞానశాస్త్రవేత్తలందరూ తమ ప్రయోగశాలల్ని ఇంతవరకు తడిమి కూడా చూడని దేవుణ్ణి ప్రార్థననూ ఆధ్యాత్మిక శక్తుల్నీ అధ్యయనం చెయ్యడానికి వినియోగిస్తారు. ఈ రోజు వచ్చినవాడు ప్రపంచం, వెనకటి నాలుగు తరాల్లోనూ చూసిన ప్రగతికన్న ఎక్కువ ప్రగతిని ఒక్క తరంలోనే చూస్తుంది.”