ఈ పుట అచ్చుదిద్దబడ్డది

750

ఒక యోగి ఆత్మకథ

ఉన్నారు. సుమారు ఇరవై ఐదు మంది సత్యాగ్రహులు కూర్చున్నారు; వాళ్ళకు ఎదురుగా ఇత్తడి కప్పులూ కంచాలు పెట్టి ఉన్నాయి. అందరూ కలిసి ప్రార్థన చేశారు; తరవాత పెద్ద ఇత్తడిపాత్రలు తెచ్చి వాటిలోంచి, నెయ్యివేసిన చపాతీలు తీసి వడ్డించారు; ‘తాల్సరీ’ (ఉడకబెట్టిన కూరగాయల ముక్కలు), నిమ్మకాయ మరబ్బా కూడా వేశారు.

మహాత్ములు చపాతీలు, ఉడకబెట్టిన బీట్ దుంపలు, కొన్ని పచ్చికూరలు, నారింజకాయలు తిన్నారు. కంచానికి ఒక పక్కన పెద్ద వేపాకు ముద్ద ఉంది; రక్తాన్ని శుభ్రపరచడంలో వేపాకు చెప్పుకోదగ్గది. ముద్దలో కొంతభాగం ఆయన చెమ్చాతో విడదీసి నా కంచంలో వేశారు. బలవంతాన మా అమ్మ నా చేత వెగటుమందులు మింగించిన చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. నేను దాన్ని నోట్లో వేసుకుని మంచినీళ్ళతో బాటు గుటుక్కున మింగేశాను. కాని గాంధీగారు, అరుచి అనుకోకుండా, ఆ వేపాకుల ముద్ద కొద్దికొద్దిగా నమిలి తిన్నారు.

ఇచ్ఛానుసారంగా తమ మనస్సును ఇంద్రియాల మీంచి మళ్ళించే సామర్థ్యం మహాత్ములకు ఉందని ఈ చిన్న సంఘటనలో గమనించాను. కొన్నేళ్ళ కిందట ఆయనకు గిలక (appendectomy) ఆపరేషను జరిగిన సంగతి గుర్తొచ్చింది నాకు. మత్తుమందు లేవీ తమకు అక్కర్లేదని ఆ సాధువు, ఆపరేషను జరుగుతున్నంత సేపూ తమ శిష్యులతో కులాసాగా కబుర్లు చెప్పారు. ఆయనకు బాధను గురించిన స్పృహ లేదన్న విషయాన్ని ఆయన ప్రశాంతమైన చిరునవ్వు వెల్లడిస్తోంది.

మధ్యాహ్నం గాంధీగారి ప్రముఖ శిష్యురాలైన మాడలీన్ స్లేడ్‌తో ముచ్చటించే అవకాశం కలిగింది; ఒక ఇంగ్లీషు నౌకా సేనాధిపతి కుమార్తె ఈమె; ఈ అమ్మాయి పేరు ఇప్పుడు మీరా బెహిన్.[1] ఈమె

  1. గాంధీ మహాత్ములు రాసిన ఉత్తరాలు కొన్ని ఈమె ప్రకటించింది. ఈమెకు గురువుగారు నేర్పిన స్వయంశిక్షణ వీటిలో వెల్లడి అవుతుంది. (‘గాంధీస్ లెటర్స్ టు ఏ డిసైపుల్’, హార్పర్ అండ్ బ్రదర్స్, న్యూయార్కు, 1950).

    తరవాత ప్రచురించిన ఒక పుస్తకం (ది స్పిరిట్స్ పిల్గ్రిమేజ్; కోవర్డ్ - మెక్‌కాన్, న్యూయార్కు, 1960) లో మిస్ స్లేడ్, గాంధీగారిని వార్ధలో కలుసుకున్న అనేకమందిని గురించి ప్రస్తావించింది. ఆమె ఇలా రాసింది: “ఇంతకాలం గడిచాక ఇప్పుడు నేను వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోలేను; కాని ఇద్దరు మాత్రం మనస్సులో స్పష్టంగా, నిలిచిపోయారు: టర్కీదేశపు ప్రసిద్ధ రచయిత్రి హాలిద్ ఎదీబ్ హానుమ్, అమెరికాలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థను స్థాపించిన స్వామి యోగానందగారు.” (ప్రచురణకర్త గమనిక).