ఈ పుట ఆమోదించబడ్డది

732

ఒక యోగి ఆత్మకథ

కొంటారు.[1] కారణ శరీరమనే నాజూకు ముసుగు మాత్రమే కప్పి ఉన్న వాళ్ళు, సృష్టికర్తలాగే విశ్వాల్ని సృష్టించగలరు. సృష్టి అంతా విశ్వ స్వప్నజాలంతో రూపొందినందువల్ల, కారణ శరీరమనే పలచని వస్త్రం ధరించిఉన్న ఆత్మ, వివిధ విస్తృతరూపాల్లో శక్తిని సాక్షాత్కరింప జేసుకొంటూ ఉంటుంది.

సహజంగా కంటికి కనిపించని ఆత్మను దాని శరీరం చేతా వివిధ శరీరాలచేతా మాత్రమే గుర్తు పట్టడానికి వీలవుతుంది. శరీరం ఒకటి ఉందంటే, అది తీరని కోరికవల్ల ఏర్పడినట్టే లెక్క.[2]

“మానవుడి ఆత్మ, ఒకటో రెండో మూడో - శరీరమనే సీసాల్లో బంధించి ఉండి, అజ్ఞానమూ కోరికలూ అనే బిరడాలతో గట్టిగా బిగించి ఉన్నంతకాలం అతడు, పరమాత్మ సాగరంలో లీనం కాలేడు. చావు అనే సుత్తి దెబ్బతో స్థూల భౌతికకాయం బద్దలయిపోయినప్పుడు సూక్ష్మ, కారణ శరీరాలనే తక్కిన తొడుగులు రెండూ, సర్వవ్యాప్త ప్రాణమనే పరమాత్మతో సచేతనంగా లీనంకావడానికి వీలులేకుండా ఆత్మను నిరోధించడానికి, ఇంకా మిగిలి ఉంటాయి. జ్ఞానం ద్వారా నిష్కామం అలవడినప్పుడు, దాని శక్తి తక్కిన కోశాల్ని రెండిటినీ ఛిన్నా భిన్నం చేసేస్తుంది.

  1. వెనకటి జన్మల్లో ఎప్పుడో, లాహిరీ మహాశయులకు ఒక మహాభవనం కోసం అవచేతనలో దాగిఉన్న ఒక్క కోరికా నెరవేరడానికి బాబాజీ తోడ్పడ్డట్టుగానే. దీన్ని 34 ఆధ్యాయంలో వివరించడం జరిగింది.
  2. “శరీరం ఎక్కడున్నా సరే, డేగలు దాని దగ్గరికి చేరతాయి, అన్నారాయన వాళ్ళతో.”– లూకా 17 : 37. భౌతిక శరీరంలోనో, సూక్ష్మశరీరంలోనో, కారణ శరీరంలోనో - ఆత్మ ఎక్కడ అబద్ధమై ఉంటే అక్కడ - మానవుల ఇంద్రియపరమైన బలహీనతల్ని కాని, సూక్ష్మకారణ శరీరానుబంధాల్ని కాని అవకాశంగా తీసుకొని, కోరికలనే డేగలు ముసిరి, ఆత్మను బంధీని చేస్తాయి.