ఈ పుట ఆమోదించబడ్డది

710

ఒక యోగి ఆత్మకథ

పూర్‌లో శ్రీయుక్తేశ్వర్‌గారి బాలశిష్యుడైన ప్రఫుల్లను పిలిపించి, అతను రాంచీ విద్యాలయంలో చేరడానికి తగ్గ ఏర్పాట్లు చేశాను.

“మీరు అలహాబాద్ మేళాకు బయలుదేరిననాడు పొద్దున, గురుదేవులు, రాతబల్లమీద భారంగా వాలిపోయారు,” అని చెప్పాడు ప్రపుల్ల.

“ ‘యోగానంద వెళ్ళిపోయాడు! యోగానంద వెళ్ళిపోయాడు!’ అంటూ విలపించారాయన. తరవాత నిగూఢంగా ఇలా అన్నారు: ‘మరో పద్ధతిలో చెప్పాలతనికి.’ అప్పుడాయన గంటల తరబడి మౌనంగా కూర్చున్నారు.

ఉపన్యాసాలతో, తరగతులతో, ఇంటర్య్వూలతో, పాతస్నేహితుల్ని తిరిగి కలుసుకోడంతో గడిచిపోయాయి ఆ రోజులు. పైకి నవ్వుతూ నిర్విరామమైన కార్యకలాపాలలో మునిగి ఉన్నా, సర్వానుభూతి సైకత తటాల మధ్య అనేక సంవత్సరాలపాటు యథేచ్ఛగా ప్రవహిస్తూ వచ్చిన నా ఆనంద నది, ఈ విషాద సంఘటన అనే వాగు కలవడం వల్ల కలుషితమయి పోయింది.

“ఆ దివ్యఋషి ఎక్కడికి వెళ్ళారు?” అంటూ నా అంతరంగ అఖాతాల్లోంచి నిశ్శబ్దంగా అరిచాను.

సమాధానం రాలేదు.

“గురుదేవులు, విశ్వ ప్రేమాస్పదుడైన పరమాత్మలో పూర్తిగా ఐక్యంకావడమే మంచిది,” అని నా మనస్సు నాకు నచ్చజెప్పింది. “అమర లోకంలో ఆయన శాశ్వతంగా విరాజిల్లుతున్నారు.”

“ఆయన్ని మరెన్నడూ పాత శ్రీరాంపూర్ భవనంలో నేను చూడ లేక పోవచ్చు,” అని హృదయం విలపించింది. “ఇక మీదట, ఆయన్ని