ఈ పుట ఆమోదించబడ్డది

50

ఒక యోగి ఆత్మకథ

టిక్కెట్టు వాళ్ళే కొనుక్కోవాలి. అలాగయితే, మనమందరం కలిసి పారి పోతున్నామన్న సంగతి స్టేషనులో ఎవరూ కనిపెట్టలేరు,” అన్నాడు.

నేను ఏమీ అనుమానించకుండా, అతని సూచనకు ఒప్పుకొన్నాను. మునిమాపువేళకు మా బండి బర్ద్వాన్‌లో ఆగింది. జతీన్‌దా టిక్కెట్ల ఆఫీసులోకి వెళ్ళాడు. అమరూ నేనూ ప్లాట్‌ఫారం మీద కూర్చున్నాం. పదిహేను నిమిషాల సేపు అలా కాసుకొని ఉండి, అప్పుడింక వృథాగా వాకబులు మొదలు పెట్టాం. అన్ని వేపులా వెతుకుతూ – ఎంతో గాభరాగా – జతీన్‌దా కోసం పేరు పెట్టి అరవడం మొదలు పెట్టాం. కాని అతను, ఆ చిన్న స్టేషను చుట్టూ ఆవరించిన చీకటిలో కలిసిపోయాడు.

నేనొక విచిత్రమైన స్తబ్ధతకు లోనయ్యాను. నా ధైర్యం పూర్తిగా సడలిపోయింది. నిరుత్సాహపరిచే ఈ దుర్ఘటనను దేవుడే కలగజేస్తాడా? ఆయన్ని చేరుకోడం కోసం మొట్టమొదటి సారిగా ఎంతో జాగ్రత్తగా పథకం వేసుకొని ఇంటినుంచి పారిపోవడానికి నేను కూర్చిన కల్పనాత్మకమైన సన్నివేశం దారుణంగా భగ్నమయింది.

“అమర్, మనం ఇంటికి వెళ్ళిపోదాం.” పసిపిల్లవాడిలా ఏడుస్తూ అన్నాను నేను. “జతీన్‌దా ఇంత తెగించి వెళ్ళిపోవడం మనకి అపశకునం. ఈ ప్రయాణం దెబ్బతినక మానదు.” అన్నాను.

“దేవుడిమీద నీకున్న ప్రేమ ఇదేనా? ఒక దగాకోరు స్నేహితుడి చిన్న పరీక్ష కే నిలబడలేవా?” అన్నాడు అమర్.

ఇది దేవుడు పెట్టిన పరీక్ష అన్న సంగతి అమర్ మాటల్లో ధ్వవించడంతో నా గుండె కుదుటపడింది. సీతాభోగ్ (అమ్మవారి నైవేద్యం) కూ, మోతీచూర్ (మిఠాయి బూందీ) కూ బర్ద్వాన్ పెట్టింది పేరు; అప్పటికి అవి తిని సేద దీర్చుకున్నాం. మరికొన్ని గంటల్లో, బెరైలీమీదుగా