ఈ పుట ఆమోదించబడ్డది

672

ఒక యోగి ఆత్మకథ

ఆయుధాలు శక్తి హీనమైనవి; మేము బంగారానికి మనసుపడం, చావుకూ భయపడం. కనక నువ్వెళ్ళి, అలెగ్జాండరుకు చెప్పు; నీదైన దేదీ దండామిస్‌కి అక్కర్లేదు. కనక, నీ దగ్గరికి రాడు. నీకు దండామిస్ దగ్గర్నించి ఏమైనా కావలిస్తే, నువ్వే రా అతని దగ్గరికి.”

ఓనెసికృతోస్ సముచితంగా సందేశం అందించాడు; అలెగ్జాండరు చాలా శ్రద్ధగా విన్నాడు; “దండామిస్ ముసలివాడూ, దిగంబరుడూ అయినప్పటికీ కూడా, అనేక రాజ్యాల్ని జయించిన తనకు ఏకైక విరోధిగా, తనను మించినవాడిగా తారసపడ్డందుకు, ఆయన్ని చూడాలన్న కోరిక, అంతకు ముందెన్నడూ కలగనంత ప్రబలంగా కలిగింది.”

దార్శనిక ప్రశ్నలకు క్లిష్టమైన సమాధానాలు చెప్పడంలో పేరుగన్న బ్రాహ్మణ తపస్వుల్ని కొందరిని అలెగ్జాండరు తక్షశిలకు ఆహ్వానించాడు. అప్పటి వాగ్వివాదం వివరాలు ప్లుటార్క్ పొందుపరిచాడు; ప్రశ్నలన్నీ అలెగ్జాండరే తయారుచేశాడు.

“అసంఖ్యాకంగా ఉన్నవి ఏమిటి? బతికున్నవా, చచ్చిపోయినవా?”

“బతికున్నవి; చచ్చిపోయినవి లేనివే కనక.”

“పెద్దపెద్ద జంతువుల్ని పుట్టించేది ఏమిటి, సముద్రమా భూమా!”

“భూమి; సముద్రం కేవలం భూమిలో భాగమే కనక.”

“జంతువుల్లో అన్నిటికన్న తెలివయింది ఏమిటి?”

“మనిషికి ఇంతవరకు పరిచయం కానిది.” (అజ్ఞాత మయిన దానికి మనిషి భయపడతాడు).

“మొదట ఉన్నది ఏది, దినమా రాత్రా?”