ఈ పుట ఆమోదించబడ్డది

శిలువ గాయాలున్న థెరిసా నాయ్‌మన్

643

సరిగ్గా ఈ సమయంలో, నా వెనకాల దభీమని పెద్ద చప్పుడయింది. ఒక్క క్షణం తల తిప్పి చూశాను; సాగిలబడ్డ ఒక శరీరాన్ని ఇద్దరు మనుషులు సాయంపట్టి తీసుకువెళ్ళడం గమనించాను. అప్పటికింకా నేను గాఢమైన అధిచేతన స్థితిలోంచి బయటికి వస్తున్నందువల్ల, పడిపోయిన మనిషిని వెంటనే పోల్చలేకపోయను. మళ్ళీ నా కళ్ళని థెరిసా ముఖం మీద నిలిపాను, నెత్తుటి వాగులవల్ల, చావు దగ్గరపడ్డవాడి ముఖం పాలిపోయినంతగా పాలిపోయిన ఆమె ముఖం, ఇప్పుడు పరిశుద్ధతనూ పవిత్రతనూ, ప్రసరింపజేస్తూ ప్రశాంతంగా ఉంది. అటుతరవాత నా వెనకాల శ్రీరైట్‌ను చూశాను. అతను చెంపకు చెయ్యి ఆన్చుకుని నిలబడ్డాడు, చెంపనుంచి నెత్తురు ఓడుతోంది.

“డిక్ , పడిపోయినవాడివి నువ్వా?” అంటూ ఆదుర్దాగా అడిగాను.

“ఔనండి. ఆ భయంకర దృశ్యం చూసి మూర్ఛపోయాను.”

“బాగుంది; తిరిగివచ్చి ఆ దృశ్యాన్ని మళ్ళీ చూసే ధైర్యం ఉంది నీకు,” అన్నాను ఓదార్పుగా.

ఓర్పుగా కాసుకుని ఉన్న యాత్రికుల బారును గుర్తు చేసుకుని నేనూ శ్రీరైట్, మౌనంగా థెరిసాకు వీడ్కోలు చెప్పి ఆమె పవిత్ర సన్నిధినుంచి బయటికి వచ్చాం.[1]

  1. 1948 మార్చి 26 తేదీన జర్మనీ నుంచి వచ్చిన ఐ. ఎన్ . ఎన్. వార్తలో ఇలా ఉంది: “ఈ గుడ్‌ఫ్రైడేనాడు ఒక జర్మన్ కర్షకస్త్రీ మంచం మీద పడుక్కొని ఉంది; శిలువ వేసిన మేకులవల్లా, ముళ్ళకిరీటంవల్లా క్రీస్తు శరీరం మీద ఎక్కడెక్కడినించి నెత్తురు ఓడిందో, ఆమె శరీరంలోని ఆ భాగాల్లో తల మీద, చేతులమీద, భుజాలమీద నెత్తుటి మరకలున్నాయి. వేలకొద్దీ జనం, విస్మితులైన జర్మన్లూ, అమెరికన్లూ, తన కుటీరంలో మంచంమీద ఉన్న థెరిసా నాయ్‌మన్ పక్కనుంచి నిశ్శబ్దంగా నడుస్తూ సాగిపోయారు.

    ఈ మహాక్షతచిహ్నధారిణి, 1962 సెప్టెంబరు 18 తేదీన కాసర్‌స్రాత్‌లో మరణించింది (ప్రచురణకర్త గమనిక).