ఈ పుట ఆమోదించబడ్డది

642

ఒక యోగి ఆత్మకథ

ధారగా పలచగా, ఎడతెరిపిలేకుండా స్రవించింది. ఆమె చూపు, నుదుటి మధ్యనున్న జ్ఞాననేత్రం వేపు కేంద్రీకరించి ఉంది. ఆమె తలకు చుట్టిఉన్న గుడ్డ, [క్రీస్తు] ముళ్ళ కిరీటం తాలూకు గాయాలనుంచి వచ్చిన నెత్తుటితో తడిసి ముద్దయింది. ఆమె గుండెమీదున్న తెల్లటి వస్త్రం మీద ఎర్రటి మరక అయింది. అనేక యుగాల కిందట సైనికుడి బల్లెపు పోటుతో చివరి అవమానాన్ని భరించిన క్రీస్తు శరీరంమీద గాయమయినచోటనే, ఆమె కయిన గాయంనుంచి వచ్చింది ఆ నెత్తురు.

మాతృవాత్సల్యంతోనూ ప్రార్థనపూర్వకంగానూ చూపే చేష్టగా చాపి ఉన్నాయి థెరిసా చేతులు; ఆమె ముఖంలోని అభివ్యక్తి వ్యథాభరితంగానూ దివ్యంగానూ కూడా ఉంది. ఆమె చిక్కిపోయినట్టూ లోపలా బయటా కూడా అనేక రకాలుగా సూక్ష్మంగా మారినట్టూ కూడా ఉంది. ఏదో విదేశభాషలో గొణుగుతూ ఆమె, తన అధిచేతన దర్శనంలో గోచరిస్తున్న వ్యక్తుల్ని చూసి, కొద్దిగా వణుకుతున్న పెదవులతో మాట్లాడింది.

నేను ఆమెతో అనుసంధానమై ఉన్నందువల్ల ఆమె ఆంతర్దర్శనాల్లోని దృశ్యాల్ని చూడడం ప్రారంభించాను. అపహాస్యం చేస్తున్న జనసమూహం మధ్యలో శిలువకొయ్యలు మోసుకు వెళ్తున్న ఏసును గమనిస్తోందామె.[1] గాభరాగా చటుక్కున తల ఎత్తింది; ఆ క్రూరభారం కింద ప్రభువు పడిపోయాడు. అంతర్దర్శనం అదృశ్యమయింది. గుండె తరుక్కుపోయే జాలితో థెరిసా, బరువుగా తలగడమీదకి వాలిపోయింది.

  1. నేను రావడానికి ముందు గడిచిన గంటల్లో థెరిసా, క్రీస్తు జీవితంలోని తుది పది రోజుల అంతర్దర్శనాలు అనేకం పొందింది. మామూలుగా ఆమె సమాధి స్థితి ‘కడపటి రాత్రి విందు’ (Last Supper) వెంబడి జరిగిన సంఘటనల దృశ్యాలతో మొదలయి, శిలువమీద క్రీస్తు మరణంతోగాని, అప్పుడప్పుడు, ఆయన్ని సమాధి చెయ్యడంలోగాని ముగుస్తూ ఉంటుంది.