ఈ పుట ఆమోదించబడ్డది

638

ఒక యోగి ఆత్మకథ

నా చూపు, బలంగా నాజూకుగా ఉన్న ఆమె చేతులమీద పడేసరికి, థెరిసా, రెండు చేతుల వెనకాలా కొత్తగా నయమయిన గాయాల తాలూకు నల్చదరం మచ్చలు నాకు చూపించింది. ప్రతి అరచేతిలోనూ కొత్తగా నయమయిన, చంద్రవంక ఆకారంలో ఉన్న, చిన్న గాయాన్ని చూపించింది. ఆ గాయం సూటిగా చేతిలో ఈవేపు నుంచి అవేపుకి ఉంది. వాటిని చూసేసరికి, తూర్పుదేశాల్లో ఇప్పటికీ వాడుకలో ఉన్న పొడుగాటి చదరపు ఇనపమేకులు గుర్తుకు వచ్చాయి నాకు; వాటికి బొడిపె చంద్రవంక ఆకారంలో ఉంటుంది; అటువంటి మేకులు పడమటి దేశాల్లో ఎన్నడూ చూసిన గుర్తు లేదు.

ఆ సాధ్వి, వారంవారం తనకు అనుభవంలోకి వచ్చే సమాధిస్థితుల గురించి కొంత చెప్పింది. “నిస్సహాయురాలైన ప్రేక్షకురాలిగా, క్రీస్తు వ్యథనంతా గమనిస్తూ ఉంటాను.” ప్రతివారం, గురువారం నడిరాత్రి నించి శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆమె గాయాలు విచ్చుకొని నెత్తురు ఓడుతుంది. మామూలుగా ఆమెకుండే 121 పౌన్ల బరువులో పది పౌన్లు తగ్గిపోతుంది. థెరిసా, సానుభూతిపూర్వకమైన ప్రేమతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా, వారంవారం కలిగే, ప్రభువు అంతర్దర్శనాల కోసం ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటుంది.

బైబిలు కొత్త నిబంధనల్లో గ్రంథస్థమైన ప్రకారం ఏసు జీవితమూ ఆయన్ని శిలువవేయడమూ అన్నవాటి చారిత్రక యథార్థతను క్రైస్తవు లందరికీ తిరిగి ధ్రువపరచడానికీ ఆ గలిలీయ గురువుకూ ఆయన భక్తులకూ ఉండే శాశ్వతానుబంధాన్ని నాటకీయంగా ప్రదర్శించడానికి దేవుడు ఆమె విచిత్ర జీవితాన్ని ఉద్దేశించాడని నేను వెంటనే గ్రహించాను.

ప్రొఫెసర్ వుట్జ్, ఆ సాధ్వితో తమకు గలిగిన కొన్ని అనుభవాలు చెప్పాడు.