ఈ పుట ఆమోదించబడ్డది

శిలువ గాయాలున్న థెరిసా నాయ్‌మన్

637

ప్రతి మాటవల్లా జీవిస్తాడు’ అంటూ క్రీస్తు పలికిన సత్యానికి మీ పవిత్ర జీవితం నిత్య ప్రత్యక్ష నిరూపణం.”[1]

నేను చేసిన వ్యాఖ్యకు ఆమె మళ్ళీ ఆనందం ప్రకటించింది. “అది నిజానికి అంతే, ఈనాడు నేనీ భూమిమీద ఉన్నానంటే, దానికున్న కారణాల్లో ఒకటి, మానవుడు కేవలం తిండి వల్లనే కాకుండా, దేవుడి అదృశ్య కాంతివల్ల బతగ్గలడని నిరూపించడానికి.”

“తిండిలేకుండా బతకడమెలాగో మీరు ఇతరులకు నేర్పగలరా?”

ఆమె ఒక్కరవ్వ ఆశ్చర్యచకితురాలయినట్టు కనిపించింది. “అది నేను చెయ్యలేను; దేవుడు దాన్ని ఆశించడు.”

  1. ‘మత్తయి’ 4 : 4. మనిషి శరీరమనే బ్యాటరీ కేవలం స్థూలమైన ఆహారం (రొట్టె) వల్ల కాకుండా, స్పందనశీలక విశ్వశక్తి (మాట లేదా ‘ఓం’) వల్లనే పనిచేస్తోంది. ఆ అదృశ్య శక్తి, చిన్న మెదడు అనే ద్వారంగుండా మానవ శరీరంలోకి ప్రసరిస్తుంది. శరీరంలోని ఈ ఆరో కేంద్రం, మెడకు వెనకాల, వెనుబాముకు సంబంధించిన ఐదు చక్రాలకు (ప్రాణశక్తిని ప్రసరింపజేసే “చక్రాలు” లేదా కేంద్రాలు) పైన ఉంటుంది. శరీరానికి సరఫరా అయే విశ్వప్రాణశక్తి (ఓం) కి ప్రధాన ప్రవేశ ద్వారమనే చిన్న మెదడు (మెడుల్లా), కనుబొమల మధ్య ఉండే ఒంటికన్నులోని కూటస్థ చైతన్య కేంద్రంతో ద్విముఖం (ద్వి ధ్రువత, పొలారిటీ) గా కలిపి ఉంది: ఆ ఒంటికన్ను మానవుడి సంకల్పశక్తికి స్థానం. అప్పుడు విశ్వశక్తి, మెదడులో ఉన్న ఏడో కేంద్రంలోకి వచ్చి చేరి అక్కడ నిలకడగా ఉండి అనంత శక్తుల్ని పుంజీభవింపజేసుకున్న ఆశ్రయంలా ఉంటుంది (దీన్నే వేదాల్లో, కాంతిరూపమైన సహస్రారకమలంగా చెప్పారు). బైబిలులో ఓంకారాన్ని పరిశుద్ధాత్మ (హోలీ ఘోస్ట్) గా, లేదా సృష్టినంతనీ దైవపరంగా నిలిపి ఉంచే అదృశ్య ప్రాణశక్తిగా ప్రస్తావించడం జరిగింది. “ఏమిటీ? మీ దేహం, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమనీ అది మీకు దేవుడు అనుగ్రహించిందనీ, మీరు మీ సొత్తేమీ కాదనీ మీకు తెలియదా?” - కోరింథీయులకు 6 : 19. (బైబిలు)