ఈ పుట ఆమోదించబడ్డది

634

ఒక యోగి ఆత్మకథ

పత్రిక సంపాదకుడైన డా॥ ఫ్రిట్జ్ గెర్లిక్, “కాథలిక్ బండారం బయటపెట్టడానికి” కానర్ స్రాత్ వెళ్ళాడు కాని, చివరికి గౌరవ ప్రపత్తులతో ఆమె జీవిత కథ ఒకటి రాశాడు.

ఎప్పటిలాగే నేను, ప్రాచ్యపాశ్చాత్యాల్లో ఎక్కడయినా సరే, ఒక సాధువును కలుసుకోడమంటే ఎంతో కుతూహలపడేవాణ్ణి. మా యాత్రా బృందం జూలై 16 న, కానర్‌స్రాత్ విచిత్ర గ్రామంలో - అడుగు పెడు తూంటే నా కెంతో ఆనందం కలిగింది. బవేరియా రైతులు (మేము అమెరికా నుంచి తీసుకు వచ్చిన) ఫోర్డుకారునూ అందులో ఉన్న రకరకాల మనుషుల్నీ - ఒక అమెరికన్ యువకుడూ, ఒక వృద్ధురాలూ, పొడుగాటి జుట్టును కోటు కాలరులోకి దోపుకొని ఉన్న, గోధుమ ఛాయగల తూర్పు దేశీయుణ్ణి చూసి చాలా కుతూహలం కనబరిచారు. కాని దురదృష్టవశాత్తు పాతకాలంనాటి ఒక నుయ్యి పక్కన పూస్తున్న జిరేనియం పూలతో శుభ్రంగా, అందంగా ఉన్న థెరీసా కుటీరం, చడీ చప్పుడూ లేకుండా మూసి ఉంది. ఇరుగుపొరుగువాళ్ళు కాని, ఆ మాటకు వస్తే - పక్కనించి వెళ్ళిన పోస్ట్‌మాన్ కాని, మా కేమీ సమాచారం ఇవ్వలేకపోయారు. వానపడ్డం మొదలయింది; ఇంక వెళ్ళిపోదామని అన్నారు మా సహచరులు.

“ఊఁహుఁ! థెరిసా దగ్గరికి దారితీసే ఉపాయం ఏదో ఒకటి తెలుసుకునేవరకు నే నిక్కడే ఉంటాను.” అన్నాను మొండి పట్టుదలతో.

రెండు గంటలు గడిచాక కూడా మేము, విసుగు పుట్టించే వానలో మా కారులోనే కూర్చుని ఉన్నాం. “ప్రభూ! ఆమె ఇక్కణ్ణించి అదృశ్య మయినట్లయితే నన్నెందుకు తీసుకువచ్చావయ్యా ఇక్కడికి?” అంటూ నిష్టూరమాడుతూ నిట్టూర్చాను.