ఈ పుట ఆమోదించబడ్డది

గులాబీలమధ్య సాధువు, లూథర్ బర్బాంక్

629

నేను, తలుపులు మూసుకొని, ఇరవైనాలుగు గంటలు ఏకాంతంగా గడిపాను.

ఆ మర్నాడు, లూథర్‌గారి ఫొటో ఒకటి పెద్దది ఎదురుగా పెట్టుకుని, వైదిక కర్మకాండ జరిపించాను. నా అమెరికన్ శిష్యుల్లో కొందరు హిందూ వేషధారణ చేసి, పాంచభౌతిక తత్త్వాలకూ అవి అనంత సత్తలో తిరిగి లయమవడానికీ ప్రతీకలయిన పూలతో, నీళ్ళతో, నిప్పుతో శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉండగా, మంత్ర పఠనం చేశారు.

బర్బాంక్‌గారి భౌతిక కాయం, శాంటా రోసాలోని తమ తోటలో తాము స్వయంగా పాతిన లెబనాన్ సెడార్ (దేవదారు) వృక్షం కింద పూడ్చిపెట్టి ఉన్నప్పటికీ, నా దృష్టిలో ఆయన ఆత్మ, విప్పారిన కళ్ళతో దారిపక్క పూసే ప్రతి పువ్వులోనూ ప్రతిష్ఠితమై ఉంది. ప్రకృతి విశాల తత్త్వంలో కొంతకాలం ఉండడానికి లూథర్‌గారు ఇక్కణ్ణించి వెళ్ళి పోయినా, ప్రకృతిలో వీచే గాలుల్లో ఆయన గుసగుసలాడడం లేదా, పొడజూపే తొలిపొద్దుల్లో ఆయన నడయాడడం లేదా?

ఆయన పేరిప్పుడు, సామాన్య వ్యవహారభాషా వారసత్వంలో వచ్చేసింది. వెబ్‌స్టర్ న్యూ ఇంటర్నేషన్ డిక్షనరీలో “బర్బాంక్” అన శబ్దాన్ని సకర్మక క్రియగా చేరుస్తూ ఇలా నిర్వచించారు: (మొక్క సంకరకరణంచేయు లేదా అంటుగట్టు. దాన్నిబట్టి, లాక్షణికార్థంలో మంచి లక్షణాల్ని ఎంపికచేసి చెడ్డవాటిని తిరస్కరించి లేదా మంచి లక్షణాల్ని చేర్చి (ఒక ప్రక్రియగాగాని, సంస్థగాగానీ, దేన్నయినా మెరుగు పరచడం.”

ఆ నిర్వచనం చదివిన తరవాత నేను కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను. “ప్రియమైన బర్బాంక్, ఇప్పుడు, మీ పేరే మంచితనానికి మారు పేరయింది!”