ఈ పుట ఆమోదించబడ్డది

626

ఒక యోగి ఆత్మకథ

బర్బాంక్‌గారు ప్రకృతితో ఏర్పరచుకున్న సన్నిహిత సంపర్కం వల్ల, అది భద్రంగా దాచిపెట్టుకున్న అనేక రహస్యాల్ని ఆయనకి విప్పిచెప్పింది; దానివల్ల బర్బాంక్‌గారికి అపరిమితమైన ఆధ్యాత్మిక భక్తి ప్రపత్తులు కుదిరాయి.

“ఒక్కొక్కప్పుడు, నేను అనంతశక్తికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూంటుంది,” అంటూ సిగ్గుపడుతూ నాకు చెప్పారాయన. సంవేదన శీలమైన ఆయన సుందరముఖం, వెనకటి జ్ఞాపకాలతో వెలుగొందింది. “అప్పుడు నేను, నా చుట్టూ ఉన్న రోగుల్నీ తెగుళ్ళువచ్చిన చాలా మొక్కల్నీ నయం చెయ్యగలిగాను.”

ఆయన తమ తల్లిగారి గురించి చెప్పారు. ఆమె చిత్తశుద్ధిగల క్రైస్తవ మహిళ, “ఆవిడ చనిపోయిన తరవాత చాలాసార్లు, అంతర్దర్శనాల్లో ఆవిణ్ణి చూసే భాగ్యం కలిగింది; ఆవిడ నాతో మాట్లాడింది,” అన్నారు లూథర్‌గారు.

మనస్సు వెనక్కి లాగుతున్నప్పటికీ మేము మళ్ళీ ఆయన ఇంటికేసీ, ఆయనకోసం కాసుకుని ఉన్న వెయ్యి ఉత్తరాల కేసీ మళ్ళాం.

“లూథర్‌గారూ, ప్రాచ్యపాశ్చాత్య ప్రపంచాల సత్యోపదేశాల్ని అందించడానికి నేనొక పత్రిక ప్రారంభిస్తాను; నా పత్రిక కొక మంచి పేరు నిర్ణయించడంలో మీరు సాయం చెయ్యండి,” అన్నాను.

రకరకాల పేర్ల గురించి మేము కొంత సేపు చర్చించుకున్నాం.