ఈ పుట ఆమోదించబడ్డది

గులాబీలమధ్య సాధువు, లూథర్ బర్బాంక్

625

కావలసిన వంక దొరికింది,” అని ఉల్లాసంగా చెప్పారు లూథర్‌గారు. ఆయన ఒక పెద్ద డస్కు సొరుగు తీశారు; దాన్నిండా, విదేశయాత్రలకు సంబంధించిన కరపత్రాలు వందలకొద్దీ ఉన్నాయి.

“చూడండి, ఇలాగే నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. నా మొక్కలకీ, ఉత్తర ప్రత్యుత్తరాలకీ కట్టి పడేసినవాణ్ణి కావడంవల్ల అప్పుడప్పుడు ఈ బొమ్మలకేసి చూస్తూ విదేశయాత్రల మీద నాకున్న కోరిక తీర్చుకుంటూ ఉంటాను.”

ఆయన గేటుముందు నా కారు ఆగి ఉంది. నేనూ లూథర్ గారూ ఆ చిన్న ఊళ్ళో ఉన్న రోడ్ల వెంబడి కారులో తిరిగి వచ్చాం. అక్కడి తోటలు ఆయన సృష్టించిన శాంటా రోసా, పీచ్ బ్లో, బర్బాంక్ గులాబీలతో ముచ్చటగొలుపుతున్నాయి. నే నక్కడికి వెళ్తూ వచ్చిన కొత్తల్లో ఒకసారి, ఆ మహాశాస్త్రవేత్త క్రియాయోగదీక్ష తీసుకున్నారు. “స్వామీజీ నేను దీక్షగా యోగసాధన చేస్తున్నాను,” అన్నారాయన యోగంలో వివిధ అంశాలగురించి ఆలోచనాత్మకమైన ప్రశ్న లనేకం చేసిన మీదట లూథర్‌గారు, మెల్లగా ఇలా వ్యాఖ్యానించారు.

“నిజానికి, పాశ్చాత్య ప్రపంచం ఇప్పటికీ ఇంకా అన్వేషించడం మొదలుపెట్టని బ్రహ్మాండమైన విజ్ఞాన నిధులు ప్రాచ్య ప్రపంచానికి లభించి ఉన్నాయి.”[1]

  1. సమాధి స్థితిలోకి వెళ్ళడానికి శ్వాసక్రియను నియంత్రించడానికి ఉపకరించే “ప్రాచ్యప్రక్రియల్ని” పాశ్చాత్య విజ్ఞానశాస్త్రవేత్తలు “నేర్చుకోవాలి.” అన్నాడు. ప్రఖ్యాత ఇంగ్లీషు విజ్ఞానశాస్త్రవేత్త, డా॥ జూలియన్ హక్స్‌లీ, “ ‘ఏం’ జరుగుతుంది? ‘ఎలా’ సాధ్యమవుతుందది? ” అన్నాడాయన. 21 ఆగస్టు 1948 తేదీనాటి ‘ఎసోసియేటెడ్ ప్రెస్’ పత్రికలో ప్రచురించిన లండన్ వార్తలో ఇలా రాసి ఉంది: “ప్రాచ్యదేశాల మార్మిక విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించడం మంచిదని డా॥ హక్స్‌లీ, కొత్తగా ఏర్పడ్డ మానసికారోగ్య ప్రపంచ సమాఖ్య (World Federation of Mental Health) కు సూచించాడు. “ఈ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా కనక పరిశీలించినట్లయితే, మీ రంగంలో మీరు, ముందుకొక పెద్ద అంగ వెయ్యగలరనుకుంటాను.” అన్నాడు.