ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 38

గులాబీలమధ్య సాధువు,

లూథర్ బర్బాంక్

“శాస్త్రజ్ఞానం మాట అలా ఉంచి, మెరుగుపరిచిన మొక్కల పెంపకం విధానంలో ఉన్న కిటుకు ఏమిటంటే - ప్రేమ.” ఈ విజ్ఞత వ్యక్తం చేసినవారు లూథర్ బర్బాంక్. కాలిఫోర్నియాలో శాంటా రోసాలో ఆయనకున్న తోటలో ఆయన పక్కగా నేను నడుస్తూ ఉండగా అన్నమాట లివి. తినడానికి పనికి వచ్చే, నాగజెముడు మొక్కల మడిదగ్గర ఆగాం మేము.

ఆయన ఇంకా ఇలా చెప్పారు: “ ‘వెన్ను లేని’ నాగజెముడు తయారు చెయ్యడానికి నేను ప్రయోగాలు నడుపుతూ ఉన్నప్పుడు, ప్రేమ స్పందనలు సృష్టించడాని కని, నేను తరచుగా మొక్కలతో మాట్లాడుతూ ఉండేవాణ్ణి. ‘నువ్వేం భయపడక్కర్లేదు,’ అంటూ మొక్కకు చెప్పేవాణ్ణి. ‘కాపుదలకోసం నీ కీ ముళ్ళు అక్కర్లేదు. నేను నిన్ను కాస్తాను.’ క్రమంగా ఎడారుల్లో పెరిగే ఉపయోగకరమైన ఈ మొక్క, ముళ్ళులేని రకంగా మారింది.”

ఈ అలౌకిక ఘటనకు నేను ముగ్ధుణ్ణి అయాను. “లూథర్‌గారూ, మౌంట్ వాషింగ్టన్ గుట్టమీద మా తోటలో నాటడానికి నాకు కొన్ని నాగజెముడు ఆకులు ఇవ్వండి,” అని కోరాను.