ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండు శరీరాలున్న సాధువు

43

“గురువుల సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తాను విను. నేను రోజూ రాత్రి మరో శిష్యుడితో బాటు, ఎనిమిది గంటల సేపు ధ్యానంలో ఉండేవాణ్ణి. పగటిపూట మేము రైల్వే ఆఫీసులో పనిచేయవలసి ఉండేది. ఆ గుమాస్తా పనులు చెయ్యడానికి నాకు ఇబ్బంది అనిపించి, నా మొత్తం కాలం భగవంతుడికే వినియోగించాలని కోరుకొన్నాను. ఎనిమిది గంటల పాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలమంతా, ధ్యానం చేసేవాణ్ణి. అద్భుతమైన ఫలితాలు కలిపించాయి; బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు నా మనస్సును ప్రకాశింప జేశాయి. అయితే నాకూ, ఆ భగవంతుడికీ మధ్య ఎప్పుడూ ఒక చిన్న తెర అడ్డు ఉండేది. మనిషికి మించిన లక్ష్యశుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా, పరమాత్మలో తిరుగు విధంగా చివరికి ఐక్యమయే అవకాశం నాకు లభించనట్టు కనిపించింది. నాటి సాయంత్రం లాహిరి మహాశయుల దర్శనానికి వెళ్ళి ఆయన సహాయం కోసం అర్థించాను. రాత్రి తెల్లవార్లూ నేను ఆయన్ని బతిమాలుతూనే ఉన్నాను.

“గురుదేవా, నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం భరించలేను!”

“నే నేం చెయ్యగలను? నువ్వు ఇంకా గాఢంగా ధ్యానం చెయ్యాలి.”

“ప్రభూ-గురుదేవా! నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ భౌతిక శరీరంలో నేను దైవాంశ చూడగలుగుతున్నాను. కాని మిమ్మల్ని విశ్వరూపంలో దర్శించే భాగ్యం కలిగేటట్టు అనుగ్రహించండి!”

“లాహిరీ మహాశయులు ఆశీర్వాద ముద్రతో చెయ్యి చాపారు. అప్పుడింక వెళ్ళి ధ్యానం చెయ్యి. నీ గురించి బ్రహ్మ[1]కు మనవి చేశాను.”

  1. సృష్టికర్త రూపంలో ఉన్న భగవంతుడు ; ‘విస్తరించడం’ అనే అర్థంలో, సంస్కృతంలో వాడుకలో ఉన్న ‘బృహ్’ అనే ధాతువునుంచి వచ్చినది. ఎమర్సస్ రాసిన ‘బ్రహ్మ’ అనే పద్యం, 1857 లో ‘అట్లాంటిక్ మంత్లీ’ అన్న పత్రికలో ప్రచురించినప్పుడు పాఠకులు దిగ్భ్రమచెందారు. దానికి ఎమర్సన్ సరదాగా నవ్వుకొని,“ ‘బ్రహ్మ’కి బదులు ‘యెహోవా’ అని అనుకోమనండి; అప్పుడిఁక ఏమీ గందరగోళం అనిపించదు”అన్నాడు