ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాల్లో మహాభవన సృష్టి

553

నెరవేరింది,’ అన్నారు బాబాజీ. నేలమీంచి ఒక మట్టిపాత్ర ఎత్తారు. ‘అక్కడ చెయ్యి పెట్టి, నువ్వు కోరిన భోజన పదార్థం ఏదైనా సరే తీసుకో.’ ”

“ఖాళీగా, వెడల్పుగా ఉన్న మట్టిపాత్రను ముట్టుకున్నాను; వెన్నపూసిన వేడివేడి లూచీలు (పూరీల మాదిరి రొట్టెలు), కూర, మిఠాయిలు కనిపించాయి. నే నవి తింటూంటే, ఎప్పటికప్పుడు ఆ పాత్ర నిండి ఉండడం గమనించాను. భోజనం అయిన తరవాత మంచినీళ్ళ కోసం చుట్టూ కలయజూశాను. మా గురుదేవులు, నా ఎదుట ఉన్న పాత్ర వేపే చూపించారు. అందులో ఉన్న భోజన పదార్థం అదృశ్యమయింది; దాని బదులు నీళ్ళున్నాయి.”

“దైవ సామ్రాజ్యంలో ఐహికావసరాల్ని తీర్చే రాజ్యం కూడా కలిసే ఉంటుందని కొద్దిమంది మర్త్యమానవులే ఎరుగుదురు,’ అన్నారు బాబాజీ. ‘దైవసామ్రాజ్యం భూమికి కూడా వ్యాపించి ఉంటుంది; కాని భూసామ్రాజ్యం స్వభావ రీత్యా భ్రాంతిమూలకమయినందువల్ల, దాంట్లో సత్యసారం ఉండదు.’ ”

“ ‘ప్రియగురుదేవా, కిందటి రాత్రి మీరు, స్వర్గంలోనూ భూమిమీదా ఉన్న అందాలకు గల సంబంధాన్ని కళ్ళకు కట్టించారు!’ మాయమయిన మహాసౌధాన్ని గురించిన జ్ఞాపకాలతో చిరునవ్వు నవ్వాను; నిజంగా, మామూలు యోగి ఎవరూ అతిమనోహర విలాస వైభవోపేతమైన పరిసరాల నడుమ పరమాత్ముడి మహత్తర మర్మాల అనుభవలబ్ధి కోసం దీక్షాస్వీకారం పొందలేదన్నది నిశ్చయం! దానికి ఇప్పటి దృశ్యానికి గల పూర్తి భేదాన్ని ప్రశాంతంగా తిలకించాను. ఎండిపోయిన నేల, ఆకాశపు పైకప్పు, ఆదిమకాల సహజమయిన ఆశ్రయమిచ్చే గుహలు - ఇవన్నీ , నా చుట్టూ ఉన్న దేవదూతలవంటి సాధువులకు రమ్యమైన సహజ సన్నివేశాన్ని సమకూర్చాయనిపించింది.