ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాల్లో మహాభవన సృష్టి

551

సాగాడతను. ‘ఈ పూలపాత్రా దీని వజ్రాలూ కూడా తాకి చూడు; ఇంద్రియానుభవ పరీక్షలన్నింటికీ నిలబడతా యివి.’ ”

“పూలపాత్రను పరీక్షించాను; దాంట్లో పొదిగిన వజ్రాలు ఒక రాజు దగ్గర ఉండదగినవి. ధగధగ మెరిసే బంగారం గది గోడల్ని చేత్తో తడిమాను. నా మనస్సులో గాఢమైన సంతృప్తి వ్యాపించింది. గత జన్మల నుంచి నా అవచేతనలో మరుగుపడి ఉన్న కోరిక ఒకటి ఒకేసారి తీరినట్టూ నశించినట్టూ కూడా అనిపించింది.

“మహాప్రాసాదంలోకి దారితీసిన ఈ మిత్రుడు, అలంకారాలతో శోభిస్తున్న కమానులగుండా, నడవలగుండా కొన్ని గదుల్లోకి నన్ను నడిపించాడు; ఒక చక్రవర్తి ప్రాసాదంలో ఉండే రీతిగా గొప్ప ఉపకరణాలు అమర్చి ఉన్నాయి ఆ గదులు. మే మొక విశాలమైన హాలులోకి ప్రవేశించాం. దాని మధ్యలో ఒక సింహాసనం ఉంది; దానికి ఉజ్జ్వల వర్ణమేళనంతో దీప్తులు విరజిమ్మే రత్నాలు పొదిగి ఉన్నాయి. అక్కడ, పద్మాసనంలో ఆసీనులై ఉన్నారు, మహామహులు బాబాజీ. నిగనిగలాడుతున్న నేలమీద, ఆయన పాదాలముందు మోకరిల్లాను.

“ ‘లాహిరీ, నువ్వింకా బంగారు భవనంకోసం కన్న కలల కోరికలతోనే ఆనందిస్తున్నావా?’ నా గురుదేవుల కళ్ళు, వారి నీలమణుల్లాగే నిగనిగలాడుతున్నాయి. ‘మేలుకో! నీ లౌకిక తృష్ణలన్నీ శాశ్వతంగా తీరబోతున్నాయి.’ గూఢమైన ఆశీర్వచనాలు అస్పష్టంగా పలికారు. ‘నాయనా, లే!, క్రియాయోగం ద్వారా దైవరాజ్యంలోకి ప్రవేశించడానికి దీక్ష తీసుకో.’ ”

బాబాజీ చెయ్యి చూపారు; ఒక హోమాగ్నికుండం వెలిసింది; దాని చుట్టూ పండ్లూ పూలూ అమిరి ఉన్నాయి. జ్వాజ్వల్యమానమైన ఈ అగ్ని వేదికముందు, మోక్షకారకమైన యోగప్రక్రియాదీక్ష స్వీకరించాను.