ఈ పుట ఆమోదించబడ్డది

542

ఒక యోగి ఆత్మకథ

వచ్చింది. నువ్వు రాణీఖేత్‌కు బదిలీ అవుతున్నావు; అక్కడ ఇప్పుడొక సైనిక స్థావరం[1] ఏర్పాటవుతోంది.’

“నేనొక బంట్రోతును వెంటబెట్టుకుని 500 మైళ్ళ ప్రయాణం ఆరంభించాను. గుర్రంమీదా బగ్గీమీదా ప్రయాణాలు సాగిస్తూ, ముప్ఫై రోజుల్లో, హిమాలయ ప్రాంతంలో ఉన్న రాణీఖేత్[2] చేరుకున్నాను.

“నా ఆఫీసు పనులు భారమైనవేమీ కావు. ఆ రమణీయ పర్వత ప్రదేశాల్లో తిరుగుతూ గంటలకి గంటలు గడిపేవాణ్ణి. ఆ ప్రాంతం మహా మునుల నివాసంచేత పునీతమైందన్న జనశ్రుతి నా చెవిని పడింది. వాళ్ళని చూద్దామని నాలో గట్టి కోరిక కలిగింది. ఒకనాడు మధ్యాహ్నం అలా తిరగడంలో, నన్నెవరో పేరుపెట్టి పిలుస్తూండడం విని ఆశ్చర్యపోయాను. జోరుగా, ద్రోణగిరి పర్వతం ఎక్కుతూ పోయాను. అడవిలో చీకటి ముసురుకుపోయేలోగా నేను వెనక్కి తిరిగి రాలేనేమో అన్న ఆలోచనతో ఒక్క రవ్వ దిగులు కలిగింది.

“చివరికి, చెట్లులేని ఒక వెల్లడి ప్రదేశానికి చేరాను; దానికి ఈ పక్కా ఆ పక్కా గుహలు కనిపిస్తున్నాయి. రాతిగొట్టు కొండ అంచుల్లో ఒకదానిమీద, పడుచు వయస్సాయన ఒకరు చిరునవ్వు నవ్వుతూ నించున్నారు; నాకు స్వాగతం చెబుతున్నట్టుగా చెయ్యి చాపారు. ఆయన రాగిరంగు జట్టు ఒక్కటి మినహాయిస్తే, అచ్చూమచ్చూ నా పోలికలోనే ఉండడం చూసి ఆశ్చర్యపోయాను.

  1. తరవాత మిలటరీ శానిటోరియం. 1861 నాటికే బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాలో తంతి వార్తా విధానం నెలకొల్పింది.
  2. రాణీఖేత్ అల్మోరా జిల్లాలో, నందాదేవి పర్వత పాదసీమలో ఉంది. ఈ పర్వతం హిమాలయ శిఖరాల్లో బాగా ఎత్తయిన వాటిలో ఒకటి (25, 661 అడుగులు)