ఈ పుట ఆమోదించబడ్డది

ఆధునిక భారతీయ యోగీశ్వరులు బాబాజీ

539

డని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పే సత్యాన్ని మొట్టమొదటిసారిగా పూర్తిగా అప్పుడే అవగాహన చేసుకున్నాను.

“ఈ భూమికి సంబంధించిన గుప్తమయిన దివ్యప్రణాళికలోని అధిభౌతికాంశాలను లాహిరీ మహాశయులు, తరవాత నాకు వివరించారు,” అంటూ ముగించారు రామగోపాల్‌గారు. “ప్రత్యేకించి ఈ ప్రపంచావధి పర్యంతం తమ శరీరాన్ని నిలుపుకొని ఉండటానికి భగవంతుడు నిర్ణయించిన వ్యక్తి బాబాజీ. యుగాలు వస్తూంటాయి, పోతూంటాయి. అయినప్పటికీ మరణంలేని ఈ మహాగురువులు,[1] ప్రపంచరంగం మీద శతాబ్దాల తరబడిగా సాగుతూండే నాటకాన్ని తిలకిస్తూనే ఉంటారు.

  1. “ఇదుగో, ఎవరయినా నా మాటను మన్నించినట్లయితే (అవిచ్ఛిన్నంగా క్రీస్తు చైతన్యంలో మునిగి ఉన్నట్లయితే) అతనికి మరణమే ఎదురుకాదు. (యోహాను 8 : 51, బైబిలు). ఇలా అనడంలో ఏసుక్రీస్తు, భౌతికదేహంతో అమరజీవనం గడపడం గురించి చెప్పడం లేదు. దుర్భరమయిన అటువంటి నిర్భంధం, సాధువు సంగతి అలా ఉంచి, పాపికి విధించడానికే ఎవరూ పాలుపడరు! క్రీస్తు ప్రస్తావించిన జ్ఞాని, మరణంలాంటి అజ్ఞాన నిద్రాపారవశ్యంలోంచి మేల్కొని శాశ్వత అమరత్వ సిద్ధి పొంది ఉన్నవాడు (43 అధ్యాయం చూడండి). మానవుడి ప్రధాన ప్రకృతి నిరాకారమయిన సర్వవ్యాప్తమయిన ఆత్మ నిర్బంధంగా, లేదా కర్మానుబంధంగా సంభవించే శరీరధారణ ‘అవిద్య’కు అంటే అజ్ఞానానికి ఫలితం. చావుపుట్టుకలు రెండూ విశ్వంలోని మాయవల్ల సాక్షిభూతమయేవే నని హిందూ ధర్మశాస్త్రాలు తెలుపుతాయి. చావుపుట్టుకలన్నవి సాపేక్ష ప్రపంచంలోనే అర్థవంతమయినవి. బాబాజీ ఒక భౌతిక శరీరానికి కాని ఈ గ్రహానికి కాని పరిమితులయి ఉన్నవారు కారు; భగవంతుడి సంకల్పం ప్రకారం ఈ లోకానికి ప్రత్యేక సేవా విధి నిర్వహిస్తున్నవారు. స్వామి ప్రణవానందులవంటి మహాగురువులు కొత్త దేహాలు ధరించి ఈ లోకంలోకి తిరిగి రావడానికి కారణాలు వారికే తెలియాలి. ఈ లోకంలో, వారి జన్మలు కర్మసంబంధమయిన కఠిన నిర్బంధాలకు లోబడి ఉండేవి కావు. తమంతట తాము ఈ విధంగా తిరిగి రావడాన్ని ‘వ్యుత్థానం’. అంటే మాయాంధకారం తొలగిపోయిన తరవాత వెనకటి భూలోక జీవితానికి తిరిగి రావడం - అంటారు. సంపూర్ణంగా భగవత్సాక్షాత్కారం పొందిన గురువు, మామూలు రీతిలో చనిపోయినా, అద్భుత రీతిలో చనిపోయినా తన శరీరాల్ని తిరిగి పొంది భూలోక వాసులకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాడు. లెక్కకు అందనన్ని సూర్యమండలాలకు అధీశ్వరుడయిన పరమేశ్వరుడి సాయుజ్యం పొంది ఉన్న వ్యక్తికి భౌతిక శరీరాణువుల్ని సృష్టించటమన్నది కష్ట మయినదేమీ కాదు.

    “నా ప్రాణాన్ని తిరిగి పొందాలనే నేను విడుస్తున్నాను,” అని ఉద్ఘాటించాడు క్రీస్తు. “దాన్ని నా నుంచి ఎవ్వరూ తియ్యలేరు; నేనే దాన్ని విడుస్తున్నాను, దాన్ని అలా విడిచే శక్తి తిరిగి పొందే శక్తీ నాకున్నాయి.” (యోహాను 10 : 17-18).