ఈ పుట ఆమోదించబడ్డది

530

ఒక యోగి ఆత్మకథ

మాట్లాడ గలరు. ఈయన బాబాజీ[1] (పూజ్యులయిన తండ్రిగారు) అన్న సరళమైన పేరు పెట్టుకొన్నారు; ఇది కాక లాహిరీ మహాశయుల శిష్యులు ఇచ్చిన గౌరవ బిరుదులు ఇవి: మహాముని బాబాజీ, మహారాజ్ (పరమానంద మగ్నులయిన సాధువు), మహాయోగి (యోగులందరిలోకి గొప్పవారు), త్ర్యంబక బాబా, శివబాబా (శివుడి అవతారమనే అర్థంలో). అన్ని బంధాల నుంచీ విముక్తులయిన ఈ మహాగురువుల గోత్రనామా లేవో తెలియకపోతే నష్టమేమిటి?

“ఎప్పుడయినా, ఎవరయినా భక్తితో బాబాజీ పేరు పలికినట్లయితే ఆ భక్తుడికి తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది” [2] అన్నారు లాహిరీ మహాశయులు.

మృత్యుంజయులయిన ఈ మహాగురువుల దేహం మీద వయస్సును తెలిపే చిహ్నా లేవీ ఉండవు; పాతికేళ్ళకు మించని యువకుడిలా కనిపిస్తారు. పసిమిచాయ, నడితరం పుష్టి ఎత్తూ గల బాబాజీ సుందర దృఢకాయం దృగ్గోచరమయే తేజస్సును ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఆయన కళ్ళు నల్లటివి; ప్రశాంతంగా, ప్రేమార్ద్రతతో ప్రసన్నంగా ఉంటాయి. నిగనిగలాడే ఆయన పొడుగాటి జుట్టు రాగివన్నెలో ఉంటుంది. ఒక్కొక్కప్పుడు బాబాజీ ముఖంలో లాహిరీ మహాశయులకు ఎంత దగ్గరిపోలిక

  1. బాబాజీ (పూజ్యులయిన తండ్రిగారు) అనేది సామాన్యమైన బిరుదు. భారతదేశంలో చాలామంది గురువులను “బాబాజీ” అని పిలుస్తారు. కాని లాహిరీ మహాశయుల గురువులయిన బాబాజీ మాత్రం వాళ్ళలోవారు కారు. ఈ మహావతారుల ఉనికిని గురించి లోకానికి మొట్టమొదటిసారిగా వెల్లడి అయింది 1946లో, ‘ఒక యోగి ఆత్మకథ’ ద్వారా.
  2. ఈ ప్రకటనలోని సత్యం, ఈ పుస్తకం చదివిన చాలామంది పాఠకుల వల్ల రుజువయింది (పచురణకర్త గమనిక)