ఈ పుట ఆమోదించబడ్డది

ఆధునిక భారతీయ యోగీశ్వరులు బాబాజీ

529

బాబాజీని గురించి ఎక్కడా ఎటువంటి చారిత్రక ప్రస్తావనా లేక పోయినందుకు మనం ఆశ్చర్యపోనక్కర లేదు. ఈ పరమోత్కృష్ట, గురుదేవులు ఏ శతాబ్దిలోనూ ఎన్నడూ బహిరంగంగా దర్శనమియ్యలేదు. తప్పుడు వ్యాఖ్యానాలు చేసే ప్రచారాడంబరానికి వీరి సహస్ర వర్ష ప్రణాళికలో స్థానం లేదు. ఏకైక నీరవశక్తి అయిన సృష్టికర్త మాదిరిగానే బాబాజీ విన్రములయి మరుగున ఉండి పనిచేస్తూ ఉంటారు.

క్రీస్తు, కృష్ణుడు వంటి మహా ప్రవక్తలు ఒకానొక విలక్షణమయిన ఆసక్తి కరమయిన ప్రయోజనంకోసం భూమికి అవతరిస్తూ ఉంటారు; వచ్చిన పని నెరవేరడంతోటే నిష్క్రమిస్తూ ఉంటారు. బాబాజీవంటి ఇతర అవతారపురుషులు, చరిత్రలో ప్రసిద్ధికెక్కే ప్రముఖమైన ఒక మహా సంఘటనకు కాక, కొన్ని శతాబ్దుల తరబడి నిదానంగా సాగే మానవ పరిణామాత్మక ప్రగతికి సంబంధించిన పని చేపడతారు. అటువంటి మహా పురుషులు జనసామాన్యం స్థూలదృష్టికి అతీతంగా తెర మరుగున ఉంటారు. ఇచ్ఛానుసారంగా కనుమరుగయే శక్తి వారికి ఉంటుంది. ఈ కారణాలవల్లా తమనుగురించి ఎవరికీ ఏమీ చెప్పవద్దని శిష్యుల్ని మామూలుగా హెచ్చరిస్తూ ఉండడంవల్లా ఇటువంటి ఆధ్యాత్మిక మహామేరు సదృశులు ప్రపంచానికి అజ్ఞాతంగానే ఉండిపోతారు. ఈ పుటల్లో నేను ఇయ్యదలచినది కేవలం, బాబాజీ జీవితాన్ని గురించిన సూచన మాత్రమే; బహిరంగంగా తెలపడానికి తగినవీ సహాయకరమైనవీ అని బాబాజీ తలచిన కొన్ని వాస్తవాలు మాత్రమే.

బాబాజీ కుటుంబాన్ని గురించికాని, జన్మస్థలాన్ని గురించి కాని రచయితకు ప్రీతిపాత్రమయే పరిమిత వాస్తవాలేవీ వెల్లడి కాలేదు. ఆయన మాట్లాడేది సాధారణంగా హిందీలో; కాని ఏ భాషలో నయినా అవలీలగా