ఈ పుట ఆమోదించబడ్డది

528

ఒక యోగి ఆత్మకథ

ప్రత్యేక విధుల నిర్వహణలో ప్రవక్తలకు తోడ్పడ్డమే భారత దేశంలో బాబాజీ ధ్యేయం. ఈ విధంగా ఈయన, పవిత్ర గ్రంథాల వర్గీకరణ ప్రకారం మహావతారు లనిపించుకోడానికి అర్హులు. సన్యాసుల మఠామ్నాయాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకరాచార్యుల వారికి[1] మధ్య యుగంలో ప్రసిద్ధుడైన గురువు కబీరుకూ తామే యోగదీక్ష ఇచ్చినట్టు చెప్పారు ఈయన. పందొమ్మిదో శతాబ్దిలో ఈయన శిష్యుల్లో ప్రముఖులు మనకు తెలిసినంతవరకు, విస్మృతమయిన క్రియాయోగాన్ని పునరుద్ధరించిన లాహిరీ మహాశయులు.

బాబాజీకి క్రీస్తుతో ఎప్పుడూ సన్నిహిత సంబంధముంటూనే ఉంది. వీరిద్దరూ కలిసి ముక్తి ప్రదమయిన స్పందనలను ప్రసరింపజేస్తూనే ఉంటారు. అంతేకాకుండా వీరు, ఈ యుగంలో మోక్షప్రాప్తి కోసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు రూపకల్పన చేశారు. ఒకరు సశరీరులుగాను, మరొకరు అశరీరులుగాను ఉన్న ఈ సంపూర్ణ జ్ఞానసిద్ధులు చేసే పని ఏమిటంటే: యుద్ధాలనూ జాతివిద్వేషాలను మతపరమయిన పక్షపాతాన్ని ప్రయోగించినవాళ్ళకే బెడిసికొట్టే భౌతికవాద దుష్పరిణామాలనూ విడిచిపెట్టవలసిందిగా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం. ఆధునిక యుగ ధోరణి బాబాజీకి బాగా తెలుసు; ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతలోని క్లిష్టతల ప్రభావం ఇంకా బాగా తెలుసు. అంతేకాదు, యోగపరమయిన ఆత్మ విమోచన పద్ధతులను ప్రాచ్య, పాశ్చాత్య దేశాలన్నిటా సమంగా వ్యాప్తి చెయ్యవలసిన అవసరాన్ని గ్రహించారాయన.

  1. చారిత్రకంగా గోవిందయతి శిష్యులని తెలుస్తున్న శంకరులు, కాశీలో బాబాజీ దగ్గర క్రియాయోగ దీక్ష పొందారు. ఈ వృత్తాంతం లాహిరీ మహాశయులతోను, స్వామి కేవలానందగారితోను ముచ్చటిస్తూ బాబాజీ, ఈ అద్వైతవాదితో సమాగమనానికి సంబంధించిన ఆకర్షకమయిన వివరాలు అనేకం చెప్పారు.