ఈ పుట ఆమోదించబడ్డది

518

ఒక యోగి ఆత్మకథ

మనం ఆయుధాన్ని పిడికిట బట్టడంవల్ల లాభమేమిటి? దాంట్లోంచి నిజంగా శాంతి ఏమయినా వస్తుందా? విశ్వస్నాయువులకు బలం చేకూర్చేది సుహృద్భావమే కాని క్రౌర్యం కాదు; శాంతిగా జీవించే మానవజాతి అనంతమైన విజయఫలాల్ని తెలుసుకుంటుంది; ఈ ఫలాలు, నెత్తుటి నేలలో పెంచి పోషించిన వేటికన్నయినా మధురంగానే ఉంటాయి.

కార్యసాధకమైన ఐక్యరాజ్య సమితి, మానవ హృదయాల సహజ, అనామిక సమితిగా ఉంటుంది. ప్రాపంచిక వేదన ఉపశమనానికి అవసరమైన ఔదార్య సానుభూతులూ సునిశిత అంతర్దృష్టీ మానవుల గాఢతమమైన ఏకత్వాన్ని - అంటే, దేవుడితోగల సంబంధాన్ని గురించిన పరిజ్ఞానంవల్లనే కాని, కేవలం భిన్నత్వాలగురించి జరిపే బుద్ధిపరమైన పర్యాలోచనలవల్ల సిద్ధించవు. సోదరత్వం ద్వారా శాంతి స్థాపన అనే ప్రపంచ పరమోన్నత ఆదర్మాన్ని సారించడానికి, పరమాత్మతో జీవాత్మకు ఐక్యానుసంధానం చేకూర్చే యోగశాస్త్రం కాలక్రమాన అన్ని దేశాల్లోనూ అందరు జనులకూ వ్యాపిస్తుంది.

భారతదేశానికి మరే ఇతరదేశం కన్నా ప్రాచీనమైన నాగరికత ఉన్నప్పటికీ దాని మనుగడలోని అద్భుతలీల, ఏ విధంగా చూసినా యాదృచ్ఛిక మేమీ కాదనీ, భారతదేశం ప్రతి తరంలోనూ తానుకన్న మహాపురుషుల ద్వారా అందించిన శాశ్వత సత్యాలమీద భక్తివల్ల చేకూరిన విజయాల్లోని తార్కికమైన ఒక సంఘటనేననీ గమనించిన చారిత్రకులు మృగ్యం. కేవలం మనుగడ కొనసాగుతూండడంద్వారాను, యుగాలు (ఎన్ని యుగాలో, తలమాసిన పండితులు, మనకి నిజంగా చెప్పగలరా?) గతించినా తాను గతించకపోవడం ద్వారాను భారతదేశం, కాలం సవాలుకు ఏ దేశప్రజలూ ఇయ్యజాలని సరైన సమాధానం ఇచ్చింది.