ఈ పుట ఆమోదించబడ్డది

పూజ్యమాతతో సమావేశం

505

న్యాయదేవత కళ్ళకు గంతలుంటాయి; త్త్రైలింగస్వామి విషయంలో, ఓటమిని ఎదుర్కొన్న పోలీసులు, ఆమె ఆదర్శాన్నే అనుసరించదలిచారు.

ఆ మహాయోగి, మౌనాన్ని ఒక అభ్యాసంగా నిలుపుకుంటూ వచ్చారు. గుండ్రటి మొహం, పెద్ద పీపాలాంటి పొట్ట ఉన్నప్పటికీ త్రైలింగస్వామి, ఎప్పుడో అరుదుగా తినేవారు. వారాల తరబడి తిండి లేకుండానే ఉండి తరవాత, భక్తులు తమకు సమర్పించిన పెరుగు, కుండల కొద్దీ తాగేవారు. ఒకసారి ఒక సందేహశీలుడు, త్రైలింగస్వామిని ధాంభికుడిగా బయటపెడదామని నిర్ణయించుకున్నాడు. గోడలకు వెల్ల వేసే సున్నపునీళ్ళు ఒక పెద్ద బాల్చీనిండా తెచ్చి స్వామి ముందర పెట్టాడు

“స్వామీ,” అంటూ దొంగభక్తి చూపిస్తూ ఆ భౌతికవాది, “మీ కోసం కొంచెం పెరుగు తెచ్చాను. దయచేసి సేవించండి” అన్నాడు.

త్రైలింగస్వామి ఏ మాత్రం వెనకాడకుండా, సలసల మరుగుతున్న సున్నపు నీటిని కడబొట్టువరకు, గేలన్ల కొద్దీ తాగేశారు. మరికొద్ది నిమిషాల్లో ఆ దుష్కర్ముడు విలవిల్లాడుతూ నేలమీద పడ్డాడు.

“రక్షించండి స్వామీ, రక్షించండి. నేను నిప్పులమీదున్నాను. నా కుటిలపరీక్షకు క్షమించండి,” అంటూ అరిచాడు.

మహాయోగి మౌనం చాలించారు. “దుర్మార్గుడా, నీ ప్రాణం, నా ప్రాణం ఒక్కటేనని, నాకు విషమిచ్చినప్పుడు గ్రహించలేదు నువ్వు. సృష్టిలో ప్రతి అణువులో ఉన్నట్టే భగవంతుడు నా పొట్టలో కూడా ఉన్నాడన్న జ్ఞానమే నాకు లేకపోయి ఉంటే, ఆ సున్నం నన్ను చంపేసి ఉండేది. ఎవరు చేసింది వారికే బెడిసికొడుతుందనే దాని దివ్యార్థం ఇప్పుడు తెలుసుకున్నావు కనక, ఇంకెప్పుడూ ఇల్లాటి పన్నాగాలు ఎవరి మీదా పన్నకు.”