ఈ పుట ఆమోదించబడ్డది

పూజ్యమాతతో సమావేశం

495

“ ‘నీ చైతన్యం ఈ నక్షత్రం గుండా అనంత సామ్రాజ్యంలోకి చొచ్చుకుపోయేటట్టు చెయ్యి.’ నా గురుదేవుల గొంతులో ఒక కొత్త స్వరం ధ్వనించింది, దూరంనుంచి వినవచ్చే సంగీత మార్దవంలా.

“అనేక అంతర్దృశ్యాలు - ఒకదాని తరవాత మరొకటి, నా ఆత్మ సాగర తీరాల మీద విరిగిపడే సముద్రపు నురగలా కనిపించాయి. ఆ సర్వదిగ్దర్శక గోళాలన్నీ చివరికి ఆనంద సాగరంలో కరిగిపోయాయి. అంతులేకుండా అలలు అలలుగా ఉప్పొంగుతున్న ఆ ఆనందసాగరంలో నన్ను నేను మరిచిపోయాను. కొన్ని గంటల తరవాత నాకు బాహ్య స్పృహ వచ్చినప్పుడు, గురుదేవులు నాకు క్రియాయోగ దీక్ష ఇచ్చారు.

“ఆ రాత్రి మొదలు లాహిరీ మహాశయులు, మరెన్నడూ నా గదిలో నిద్రపోలేదు; ఆ తరవాత వారు, అసలు నిద్రపోలేదు. రాత్రీ పగలూ కూడా మేడ కింది ముందరి గదిలోనే శిష్యులతోబాటు ఉండిపోయారు.”

ఇంతమట్టుకు చెప్పి ఆ పుణ్యశీల మౌనం వహించారు. ఆ మహా యోగితో ఆవిడకుగల సంబంధానికి ఉన్న విశిష్టతను గ్రహించి, మరికొన్ని జ్ఞాపకాలు చెప్పమని ఆవిణ్ణి అడగడానికి సాహసించాను.

“అబ్బాయి, నువ్వు ఆబగా ఉన్నావు. అయినా ఇంకొక్క కథ చెబుతాను,” అంటూ సిగ్గుగా చిరునవ్వు నవ్వారావిడ, “నా గురు-పతిదేవుల విషయంలో నేను చేసిన పాపం ఒకటి నీ దగ్గిర చెప్పుకుంటాను. నాకు దీక్ష ఇచ్చిన కొన్ని నెల్లకి, నేను ఏకాకినై పోయినట్టూ నా సంగతి ఎవరూ పట్టించుకోనట్టూ బాధపడడం మొదలుపెట్టాను. ఒకనాడు పొద్దున లాహిరీ మహాశయులు, ఏదో వస్తువు తీసుకువెళ్ళడంకోసం ఈ చిన్న గదిలోకి వచ్చారు. నేనూ గబగబా వారి వెనకాలే వచ్చాను. నన్ను మాయ, కమ్మేసినందువల్ల ఆయనతో కఠినంగా మాట్లాడాను.