ఈ పుట ఆమోదించబడ్డది

అలౌకిక ఘటనల నియమం

489

నేను నా చేతులవేపు చూసుకుని ముందుకూ వెనక్కూ ఆడించాను. అయినా వాటి బరువు నాకు తెలియలేదు. ఒకానొక ఆనంద పారవశ్యం నన్ను ముంచెత్తేసింది. నా శరీరంగా రూపు గడుపుతున్న విశ్వకాంతి స్తంభం, సినిమా హాల్లో ప్రొజెక్షన్ బూత్ లోంచి పారుతూ తెర మీద బొమ్మల్ని రూపు గట్టించే కాంతి కిరణాలకు దివ్యప్రత్యుత్పాదనలా పొడగట్టింది.

నా శరీర చలనచిత్రానుభవం, మసక వెలుతురుగల ప్రదర్శనశాలవంటి నా పడగ్గదిలో, చాలాసేపు పొందాను. అంతకు పూర్వం నాకు అనేక అంతర్దర్శనాలు కలక్కపోలేదు; కాని ఇది వాటన్నిటికన్న విశిష్టమైనది. స్థూల శరీర భ్రాంతి పూర్తిగా తొలగిపోవడంతోను, సమస్త వస్తువుల సత్త్వమూ కాంతేనన్న అనుభూతి గాఢంకావడంతోను నేను పైకి, స్పందనశీలమైన ప్రాణాణువుల (లైఫ్ ట్రాన్‌ల) వేపు చూసి:

“దివ్యజ్యోతీ, నా ఈ వినమ్ర దేహ చిత్రాన్ని దయచేసి నీలో కలిపేసుకో; ఎలిజాని జ్వాలారథంలో స్వర్గానికి తీసుకుపోయినట్టు,”[1]

  1. II కింగ్స్ 2 : 11 (బైబిలు). అలౌకిక ఘటన ( “మిరకిల్”) అనేది సామాన్యంగా, నియమరహితంగా గాని నియమానికి అతీతంగాగాని వచ్చే ఫలితంగా లేదా జరిగే ఘటనగా భావిస్తారు. కాని సునిశితంగా వ్యవస్థితమై ఉన్న విశ్వంలో సంభవించే ఘటనలన్నీ నియమాను సారంగా జరిగేవీ, నియమానుసారంగా వివరించగలిగినవీను. మహాసిద్ధపురుషుని అలౌకిక శక్తులనేవి, అతని ఆంతరిక చైతన్య జగత్తులో పనిచేసే సూక్ష్మనియమాల యథార్థావగాహన ననుసరించి సహజంగా సహచరించేవే. ప్రతిదీ అలౌకిక ఘటనేనన్న గంభీరమైన అర్థంలో తప్పితే, దేన్నీ “అలౌకిక ఘటన”గా చెప్పగూడదు. మనలో ప్రతి ఒక్కరూ సంక్లిష్టంగా వ్యవస్థితమైన శరీరంతో రూపొంది ఉండడమూ నక్షత్రాల మధ్య రోదసిలో గుడిమళ్ళు తిరుగుతూండే భూమిమీద మనని ఉంచడమూ. ఏమైనా అతిసామాన్యమైన విషయాలా? లేకపోతే, ఆత్మలౌకిక ఘటనలా? ఏసుక్రీస్తూ, లాహిరీ మహాశయుల వంటి మహాప్రవక్తలు సాధారణంగా చాలా అలౌకిక ఘటనలు ప్రదర్శిస్తారు. అటువంటి మహానుభావులు మానవ జాతి కళ్యాణం కోసం, విస్తృతమూ కఠినమూ అయిన ఆధ్యాత్మిక లక్ష్యసాధనకు కృషి చెయ్యవలసి ఉంటుంది; కష్టాల్లో ఉన్నవారికి అలౌకిక శక్తితో సాయపడ్డం, దాంట్లో ఒక భాగంగా కనిపిస్తుంది. కుదర్చడానికి వీలుకాని జబ్బులకూ పరిష్కరించడానికి వీలుకాని మానవ సమస్యలకూ దైవాజ్ఞలు అక్కరపడతాయి. కపెర్న హూమ్‌లో ఒక పెద్దమనిషి, చావుబతుకుల్లో ఉన్న తన కొడుక్కి నయం చెయ్యమని కోరినప్పుడు ఏసుక్రీస్తు, ఇలా అన్నాడు: “మీరు సూచిక క్రియలనూ అద్భుతాలను చూస్తే కాని నమ్మరు,” అని తరవాత అన్నాడు: “నీ దారిన నువ్వు వెళ్ళు; నీ కొడుకు బతుకుతాడు”. యోహాను 4 : 46-54 (బైబిలు). ఈ అధ్యాయంలో నేను, భౌతిక లోకాలకు ఆధారభూతమైన భ్రాంతిజనక ఇంద్రజాల శక్తి అయిన మాయకు వేదాల్లో ఇచ్చిన వ్యాఖ్యను వివరించాను. అణు ‘‘పదార్థం”లో అసత్తు అనే ‘ఇంద్రజాలం’ వ్యాపించి ఉంటుందని పాశ్చాత్మ విజ్ఞానశాస్త్రం ఇప్పటికే కనిపెట్టింది. అయితే, ప్రకృతి మట్టుకే కాకుండా, మనిషి కూడా (తన మర్త్యత్వపరంగా) మాయకు లోబడి ఉంటాడు; అంటే, సాపేక్షతా సిద్ధాంతం, పరస్పర వైరుధ్యం, ద్వంద్వత, విలోమం, వ్యతిరేక స్థితులు అన్న వాటికి లోబడి ఉంటారు. మాయను గురించిన సత్యం మనుషులొక్కరికే అర్థమయిందని ఊహించుకో గూడదు. బైబిలు పాతనిబంధన గ్రంథం ప్రవక్తలు మాయను సాతాను (హిబ్రూలో, “శత్రువు”) అన్న పేరుతో వ్యవహరించారు. గ్రీకు టెస్టమెంటులో సాతానుకు సమానార్థకంగా డయబోలస్ లేదా డెవిల్ (దయ్యం) అన్న పదం వాడారు. సాతాను లేదా మాయ, ఏకైక నిరాకార సత్యాన్ని, మరుగుపరచడానికి అనేకానేక రూపాలు కల్పించే బ్రహ్మాండ ఇంద్రజాలకుడు. భగవంతుడి ప్రణాళికలోనూ ఆట (లీల) లోనూ సాతాను లేదా మాయకున్న ఏకైక ప్రయోజనం మానవుణ్ణి, పరమాత్మనుంచి పదార్థానికి సత్తునుంచి అసత్తుకూ మళ్ళించడానికి ప్రయత్నించడం. మాయను క్రీస్తు, దయ్యమనీ, హంతకుడనీ, అబద్ధాలకోరు అనీ కళ్ళకు కట్టించే విధంగా వర్ణిస్తాడు. “దయ్యం... ఆదినుంచీ హంతకుడే; అతని నివాసం సత్యంలో లేదు; అతనిలో సత్యం లేకపోవడమే దానికి కారణం. అతను ఏదైనా అబద్ధం చెబితే, తనంతట తానే చెబుతాడు: ఎంచేతంటే అతను అబద్ధాలకోరు! అతనే దాన్ని కల్పిస్తాడు.” (యోహాను : 8 : 44).

    “దయ్యం ఆది నుంచీ పాపం చేస్తూనే ఉంది. ఈ కారణంగా దేవుడి కుమారుడి ఆవిర్భావం జరిగింది. అతడు దయ్యం చేసే పనులు నాశనం చేయ్యడానికి.” (V యోహాను 3 : 8), అంటే, స్వయంగా మానవుడి సత్తలోనే ఉన్న కూటస్థ చైతన్యం (అంటే, క్రీస్తు చైతన్యం) ఆవిర్భావం, భ్రాంతుల్ని లేదా “దయ్యం పనుల్ని” అలవోకగానే నాశనం చేస్తుంది. మాయ “ఆది నుంచీ” ఉండడానికి కారణం, భౌతిక ప్రపంచాల్లో అది నిర్మాణాత్మకంగా అంతర్గతమై ఉండడమే. ఇవి ఎప్పటికి మార్పుకు లోనవుతూనే ఉంటాయి, ఈ పరివర్తనశీలక దైవ పరివర్తనరాహిత్యానికి విరుద్ధమైనది.