ఈ పుట ఆమోదించబడ్డది

488

ఒక యోగి ఆత్మకథ

దానికి అతీతమైనదాంట్లో ఉందనీ చివరికి నమ్మకం కుదుర్చుకొన్న నాడు, ఎవరి విలువలయినా సమూలంగా మారిపోతాయి.

నేను ఈ అధ్యాయం రాయడం పూర్తిచేసిన తరవాత, నా పక్క మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాను. నా గదిలో,[1] షేడ్లుగల రెండు దీపాలనుంచి వెలుతురు పలచగా పడుతోంది. నా చూపు పైకి లేపుతూ గది కప్పువేపు చూశాను; అక్కడ చుక్కలు తీర్చినట్టు, సన్న సన్నని ఆవాల వన్నె వెలుగులు కానవచ్చాయి; అవి రేడియం మాదిరి కాంతితో, మిణుకుమిణుకుమంటూ వణుకుతూ ఉండడం గమనించాను. వానజల్లులాంటి అసంఖ్యాకమైన కాంతి శలాకలు, ఒకచోట కూడి పారదర్శక స్తంభాకృతి పొంది మెల్లగా నా మీద పడుతున్నాయి.

వెంటనే నా భౌతికదేహం తన స్థూలత్వాన్ని కోల్పోయి సూక్ష్మ దేహంగా మారిపోయింది. పక్కను అంటీ అంటకుండా, బరువులేని నా దేహం, ఒకోసారి ఎడమవేపుకి ఒకోసారి కుడివేపుకి కొద్దికొద్దిగా కదులుతూ తేలుతున్నట్టు అనిపించింది. గది చుట్టూ కలియజూశాను; ఫర్నిచరూ గోడలూ మామూలుగానే ఉన్నాయి; కాని ఆ చిన్న కాంతిపుంజం ఎన్ని రెట్లు పెరిగిపోయిందంటే, గదిలో కప్పు అవుపడకుండా పోయింది. నేను ఆశ్చర్యచకితుణ్ణి అయాను.

“ఇదే బ్రహ్మాండ చలనచిత్ర యంత్రాంగం.” కాంతిలోంచే వెలువడుతున్నట్టుగా, ఒక స్వరం పలికింది. “నీ పక్కబట్టల తెల్లటి తెరమీద తన కిరణాన్ని ప్రసరింపజేస్తూ నీ దేహచిత్రాన్ని రచిస్తోంది. చూడు, నీ రూపం, కాంతి తప్ప మరేం కాదు!”

  1. కాలిఫోర్నియా, ఎన్సినిటాన్‌లోని సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆశ్రమంలో (ప్రచురణకర్త గమనిక).