ఈ పుట ఆమోదించబడ్డది

468

ఒక యోగి ఆత్మకథ

బృందమూ ఉన్న దృశ్యాన్ని చూసి ముగ్ధుణ్ణి అయాను. కాలచక్రం వెనక్కి తిరిగింది; నా ఎదుట ఉన్న దృశ్యం ప్రాచీనమైన ఒక ఆశ్రమంలా ఉంది - ఆనందమయుడైన ఆ గాయకుడి చుట్టూ ఆయన భక్తులు పరివేష్టించి ఉన్నారు; వారి చుట్టూ దివ్య ప్రేమ పరివేషం ప్రకాశిస్తోంది. ప్రతి స్నేహగ్రంథినీ టాగూరుగారు, సామరస్య తంతువులతో అల్లారు. ఎన్నడూ ఒత్తిచెప్పే తత్త్వంలేని ఆయన, ఒకానొక అనివార్య ఆకర్షణతో హృదయాన్ని లోబరుచుకున్నారు. ఈశ్వరుడి ఉద్యానంలో కుసుమిస్తున్న అరుదైన కవితాప్రసూనం సహజ పరిమళంతో ఇతరుల్ని ఆకర్షిస్తోంది!

రవీంద్రులు, తాము కొత్తగా రచించిన ఉత్కృష్ట కవితలు కొన్ని, శ్రావ్యమైన స్వరంతో పాడి వినిపించారు. చాలామట్టుకు ఆయన పాటలూ, నాటికలూ, విద్యార్థుల ఆహ్లాదంకోసం రాసినవి; వాటిని శాంతినికేతనం లోనే రచించారు. ఆయన పద్యాల్లో నాకు కనిపించిన సొగసు ఏమిటంటే, దాదాపు ప్రతి పంక్తిలోనూ దేవుణ్ణి ప్రస్తావిస్తూ ఉన్నప్పటికీ ఆయన పవిత్ర నామాన్ని చాలా అరుదుగా పలకడం. “గానం చేసేటప్పుడు కలిగే ఆనందంలో మత్తెక్కి, నన్ను నేనే మరిచిపోయిు, నాకు ప్రభువులైన నిన్ను, మిత్రమా అని పిలుస్తుంటాను” [సురేర్ ఘోరే ఆప్నా కే జాఈ భూలే, బంధూ బలే డాకి మోర్ ప్రభూకే] అని రాశారాయన.

ఆ మర్నాడు మధ్యాహ్న భోజనం అయిన తరవాత మహాకవిగారి దగ్గర, తప్పనిసరిగా సెలవు తీసుకున్నాను. అప్పటి ఆయన చిన్న విద్యాలయం ఇప్పుడు విశ్వభారతి[1] పేరుతో ఒక అంతర్జాతీయ విశ్వ

  1. 1950 జనవరిలో, ‘విశ్వభారతి’ అధ్యాపకులు, విద్యార్థులూ అరవై ఐదు మంది రాంచీ వచ్చి యోగదా సత్సంగ విద్యాలయంలో పది రోజులు ఉన్నారు.