ఈ పుట ఆమోదించబడ్డది

454

ఒక యోగి ఆత్మకథ

“అఁ హఁ! ఉండవు,” అన్నాను, “నిన్ను బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళిపోతారు; తరవాత నువ్వు పెళ్ళి చేసుకుంటావు.”

నమ్మశక్యం కాక, అతను నే నన్నదానికి తీవ్రంగా అభ్యంతరం చెప్పాడు: “నేను చచ్చిపోతేనే, వాళ్ళు నన్ను ఇంటికి తీసుకుపోయేది,” అన్నాడు. (కాని కొద్ది మాసాల్లోనే అతని తల్లిదండ్రులు వచ్చి, అతను ఏడ్చి మొరాయించినా లెక్కచెయ్యకుండా లాక్కెళ్ళి పోయారు. కొన్నేళ్ళ తరవాత పెళ్ళికూడా చేసుకున్నాడతను).

చాలా ప్రశ్నలకి నేను జవాబులు ఇచ్చిన తరవాత, కాశీ అనే కుర్రవాడు ప్రశ్న అడిగాడు. అతను పన్నెండేళ్ళవాడు; చాలా తెలివయిన విద్యార్థి; అతనంటే అందరికీ ఇష్టం.

“స్వామీజీ, నా అదృష్టం ఎలా ఉంటుందండి?” అని అడిగాడు.

“త్వరలో చనిపోతావు నువ్వు,” పట్ట శక్యంకాని శక్తి ఏదో పట్టుపట్టి నా నోటినించి ఈ మాటలు అనిపించినట్టు తోచింది.

ఈ ప్రకటనకు, నాతోబాటు ప్రతి ఒక్కరూ విస్మయం చెంది దుఃఖపడ్డారు. అసందర్భ ప్రలాపం చేసే కుర్రవాడిలా నన్ను నేను తిట్టుకుని, మరే ప్రశ్నలకూ జవాబు లియ్యనని చెప్పేశాను.

మేము విద్యాలయానికి తిరిగి వెళ్ళిన తరవాత కాశీ నా గదికి వచ్చాడు.

“నేను చచ్చిపోతే, తిరిగి నేను పుట్టినప్పుడు నన్ను మీరు కనుక్కుని మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకువస్తారాండీ?” అంటూ ఏడుస్తూ అడిగాడు.

కష్టమైన ఈ అసాధారణ బాధ్యతను నేను నిరాకరించక తప్పలేదు.